తెలంగాణాలో ఆలయాల్లో కార్తీక శోభ.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు!
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ఈరోజు దేశ ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వివిధ శైవ క్షేత్రాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. కార్తీక పూర్ణిమ , దేవ దీపావళి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాద్వారా ఇచ్చిన ఒక సందేశంలో ప్రధానమంత్రి, ఈ పవిత్ర పండుగ, సేవ ద్వారా నిస్వార్థత అనే సందేశాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణా రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలు శివ నామ స్మరణతో మారుమ్రోగి పోతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రం, చారిత్రక ఆలయం అయిన హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో భక్తులు ఈ రోజు తెల్లవారుజాము నుండే బారులు తీరారు. తెల్లావారు జాము నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు రుద్రేశ్వర స్వామి వారికి అభిషేకాలతో, దీపారాధనలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా రుద్రేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తుల విశేష పూజలతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంది.

భక్తులకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతుల కల్పన చేశారు. అడగడుగునా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మడికొండ మెట్టుగుట్ట రామ లింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు తెల్లవారుజామునే ఆకాశ దీపం వెలిగించారు. చారిత్రక స్వయం భువుగా వెలసిన సిద్దేశ్వర స్వామి ఆలయం కార్తీక శోభతో కళకళలాడుతోంది. తెల్లవారు జాము నుండే స్వామి వారికి అభిషేకాలు చేస్తూ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఖిల్లా వరంగల్ లోని పురాతన నేల శంభుని గుడిలో కూడా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లాలోని పలు శివాలయాలు, ఇతర ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో సామూహిక కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఏఈవో జయకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. సుహాసినులు వివిధ ఆకృతుల్లో దీపాలు వెలిగించి భక్తితో పూజలు చేశారు. మహిళా భక్తులు, సేవాసమితి సభ్యులకు ఆలయ అధికారులు పసుపు, కుంకుమ, గాజులు, వాయనం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.













Click it and Unblock the Notifications
