గోదావరి పుష్కరాలు-2027 లోగో, ట్యాగ్‌లైన్ పోటీలు ప్రారంభం.. బహుమతుల వివరాలు ఇవే!
గోదావరి పుష్కరాలు-2027ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పుష్కరాల అధికారిక లోగో, ట్యాగ్‌లైన్ రూపకల్పన కోసం పోటీలను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ వద్ద ఉన్న జేఎన్‌ఏఎఫ్‌ఏ విశ్వవిద్యాలయంలో ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో విద్యార్థులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, గోదావరి పుష్కరాలను కుంభమేళా స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కోట్లాది మంది భక్తులు, పర్యాటకులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, పుష్కరాల ప్రత్యేకతను చాటేలా ఆకర్షణీయమైన లోగో, అర్థవంతమైన ట్యాగ్‌లైన్ ఉండాలని సూచించారు.

పోటీల్లో ప్రతిభ కనబరిచి ఎంపికైన విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డిజైన్, ఆర్ట్ రంగాలపై ఆసక్తి ఉన్న కళాకారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ లోగో, ట్యాగ్‌లైన్ డిజైన్లను ఈ నెల 30వ తేదీలోపు [email protected] అనే ఈమెయిల్ చిరునామాకు పంపాలని సూచించారు.
తెలంగాణ సంస్కృతి, గోదావరి నది పవిత్రత, ఆధ్యాత్మిక వైభవం మేళవించేలా డిజైన్లు రూపొందించాలని వర్క్‌షాప్‌లో పాల్గొన్న నిపుణులు, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. గోదావరి నది తీరం వెంబడి ఉండే పుష్కర ఘాట్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను ముందుగానే సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
లోగో, ట్యాగ్‌లైన్ ఎంపిక పూర్తయిన తర్వాత ప్రచార కార్యక్రమాల్లో వాటిని విస్తృతంగా వినియోగించి, గోదావరి పుష్కరాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. గోదావరి పుష్కరాలు ప్రతి పన్నెండేళ్లకోసారి జరిగే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ఉత్సవం. గతంలో 2015లో జరిగిన పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు.
తెలంగాణలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, కోటిలింగాల వంటి ప్రధాన క్షేత్రాలతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని అనేక ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాబోయే 2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్ల విస్తరణ, స్నాన ఘట్టాల ఆధునీకరణ, రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వం ఇప్పటి నుంచే దృష్టి సారించింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్లాస్టిక్ రహిత పుష్కరాలుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.












Click it and Unblock the Notifications
