తిరుపతి-విశాఖ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- జనవరి వరకూ ఈ రైళ్లు..!
ఏపీలో రెండు కీలకమైన రైల్వే స్టేషన్లు తిరుపతి, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వేశాఖ ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లను (Tirupati-Visakhapatnam Special Trains) పొడిగించింది. తిరుపతి నుంచి విశాఖకు,అలాగే విశాఖ నుంచి తిరుపతికి ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను పండుగల రద్దీ నేపథ్యంలో మరికొంతకాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటి వివరాలను అధికారులు వెల్లడించారు.
తిరుపతి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు నంబర్ 08509 ప్రస్తుతం ప్రతీ ఆదివారం, గురువారం అందుబాటులో ఉంది. ఈ రైలును నవంబర్ 29 నుంచి వచ్చే జనవరి 28 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం, శుక్రవారం నడుపుతున్న మరో ప్రత్యేక రైలు నంబర్ 08510ని సైతం నవంబర్ 30 నుంచి వచ్చే జనవరి 29వ తేదీ వరకూ పొడిగిస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లూ రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, డోన్, బేతం చెర్ల, నంద్యాల, దిగువమెట్ట, మార్కాపురం రోడ్, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. అలాగే రేణిగుంట యార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా తిరుపతి-విశాఖ రైలు నంబర్ 08509ని ఆరు ట్రిప్పుల పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలు డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకూ పాకాల-ధర్మవరం-గుంతకల్ మార్గంలో నడుపుతారు. ఈ సమయంలో ఈ రైలుకు రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల,తాడిపత్రి స్టేషన్లలో స్టాప్ లు ఉండవని అధికారులు తెలిపారు. అలాగే ఈ రెండు రైళ్లలోనూ రెండు సెకండ్ క్లాస్ సీటింగ్ కోచ్ లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు, 10 స్లీపర్ కోచ్ లు, 4 థర్డ్ ఏసీ కోచ్ లు, ఒక సెకండ్ ఏసీ కోచ్, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ అందుబాటులో ఉంటాయి.














Click it and Unblock the Notifications
