పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఆ బిల్లుల్లో కలిపేయండి- ! సుప్రీం షాకింగ్ సూచన..!
రోడ్లపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా పోలీసులు విధించే వివిధ రకాల చలాన్లను (Traffic challans) చాలా మంది పట్టించుకోవడం లేదు. కట్టేవారు ఎప్పుడూ కడుతూనే ఉండగా.. కట్టనివారు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలోనూ ఇదే పరిస్దితి. ఈ నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై దాఖలైన ఓ కేసును విచారించిన సుప్రీంకోర్టు... ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్రాఫిక్ చలాన్ల వసూలుకు మరో మార్గం కూడా సూచించింది.
వాహనదారుల నుంచి చెల్లించని ట్రాఫిక్ చలాన్లను వసూలు చేయడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం ఇ-చలాన్లు జారీ చేస్తే సరిపోదని, వాటి ప్రభావశీలతను కూడా చూసుకోవాలని ఆదేశించింది. ప్రజలు ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే, విద్యుత్ బిల్లులతో సహా ఇతర ప్రభుత్వ బకాయిలకు వాటిని లింక్ చేసి ఆ మొత్తాన్ని వసూలు చేసే మార్గాలను అధికారులు అన్వేషించవచ్చని జస్టిస్ జె.బి.పార్దివాలా తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సుమారు రూ.45,000 కోట్ల ఇ-చలాన్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, అందులో ఇప్పటివరకు సుమారు రూ.25,000 కోట్లు వసూలు అయ్యాయని కోర్టుకు అధికారులు తెలిపారు.

దీనిపై స్పందించిన జస్టిస్ పార్దివాలా .. క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పోలీసులు వేల, లేదా లక్షల సంఖ్యలో ఈ-చలాన్లు జారీ చేయవచ్చని, కానీ వాటి ద్వారా విధించిన జరిమానాలను వసూలు చేయడమే అసలైన సమస్య అని ఆయన తెలిపారు. కాబట్టి పెండింగ్లో ఉన్న చలాన్లు గల వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల పునరుద్ధరణను నిలిపివేయడం వంటి చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపారు. అలాంటి సందర్భాలలో డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల జారీని నిలిపివేయవచ్చని, ఆయా వాహనాల యాజమాన్య బదిలీని కూడా నిరోధించవచ్చని పేర్కొన్నారు. ఒక వాహనం యొక్క చలాన్లు క్లియర్ అయ్యే వరకు దాని ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయకూడదని సూచించారు. పరివాహన్ పోర్టల్లో అటువంటి వాహనాలను బ్లాక్లిస్ట్ చేయడం , పెండింగ్లో ఉన్న చలాన్లతో ముడిపడి ఉన్న డ్రైవింగ్ లైసెన్సుల పునరుద్ధరణను నిలిపివేయడం వంటి చర్యలను కూడా పరిగణించాలని తెలిపారు. ఇప్పటికే జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేయడం, పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలకు పీయూసీ సర్టిఫికేట్లు జారీ చేయడానికి నిరాకరించడం వంటి చర్యలను కూడా సూచించారు. వాహనాలను రూడ్లపై తనిఖీ చెక్ చేసి, ఇ-చలాన్ పెండింగ్ లో ఉంటే, దాన్ని స్వాధీనం చేసుకోవచ్చని కూడా కోర్టు పేర్కొంది.














Click it and Unblock the Notifications
