ఏపీని గట్టిగా దెబ్బకొట్టిన ఎల్ నినో..: వాట్ నెక్స్ట్?
ఏపీలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌పై ప్రతికూల వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎల్ నినో వల్ల నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసే సమయానికి రాష్ట్రంలో సాధారణం కంటే గణనీయంగా తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కురవాల్సిన వర్షపాతంలో ఏకంగా 34.1 శాతం లోటు ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర ఆందోళనలో పడింది. ఇది రైతులకు సవాల్ గా మారింది.
తాజా నివేదికలో..
వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ఈ సీజన్ సాధారణ వర్షపాతం 580.1 మిల్లీమీటర్లు కాగా, కిందటి నెల 30వ తేదీ వరకు 382.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. మొత్తం తొమ్మిది జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 18 జిల్లాలు లోటు వర్షపాతంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. రాయలసీమ పరిధిలోని అన్నమయ్య జిల్లాలో వర్షపాత లోటు తీవ్రస్థాయిలో ఉంటోంది.

జిల్లాలవారీగా వర్షపాతం..
జిల్లా వారీగా సాధారణ వర్షపాత పరిస్థితులను విశ్లేషిస్తే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలు మాత్రమే ఫర్వాలేదనిపించాయి. పార్వతీపురం మన్యం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ లోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షపాతంలో తీవ్రమైన లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా వర్షపాత లోటు 60 శాతానికి పైగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
అడుగంటిన చెరువులు..
వర్షాల్లేక చెరువులు అడుగంటిపోవడం, భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోవడంతో రైతులు నిలబడిన పంటలను కాపాడుకోవడానికి ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ అదనపు ఖర్చులు రైతులకు తీరని నష్టాలను తెచ్చేలా కనిపిస్తున్నాయి. తెగుళ్ల వ్యాప్తి వారి ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీస్తోంది.

భారీగా తగ్గిన ఇన్‌ఫ్లో..
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏపీలోని ప్రధాన జలాశయాలకు ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లోలు దారుణంగా పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే జలాశయాల్లో నిల్వ ఉన్న నీటి పరిమాణం పెను ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలలో కలిపి 414.86 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంటోంది. గత ఏడాది ఇదే సమయానికి అత్యధికంగా 766.26 టీఎంసీల వర్షపు నీరు నిల్వ ఉండేది. ఇప్పుడా పరిస్థితులు లేవు.
సగానికి పైగా తగ్గిన నీటి మట్టం..
జలాశయాల సగటు నిల్వలు గత ఏడాది కంటే 45.9 శాతం పడిపోయాయి. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రధాన జలాశయంలోనూ గత ఏడాది కంటే ఎక్కువ నీరు నిల్వ లేదు. ఆధునిక దేవాలయంలా భాసిల్లుతోన్న నాగార్జున సాగర్ ఈ సారి కళ తప్పింది. ఈ రిజర్వాయర్ లో గత ఏడాది 295.70 టీఎంసీల నిల్వ ఉండగా, ఇప్పుడది 181.52 టీఎంసీలకు మాత్రమే పరిమితమైంది. వర్షాకాల సీజన్ ముగిసినా కనీస స్థాయిలో కూడా ఇన్ ఫ్లో ఉండట్లేదు.
శ్రీశైలంలో మరీ..
మరో బహుళార్థసాధక ప్రాజెక్టు శ్రీశైలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ నీటి నిల్వ ప్రస్తుతం 87.45 టీఎంసీలు మాత్రమే. గత ఏడాది ఇదే సీజన్ లో అక్కడ 206.10 టీఎంసీల నీరు ఉండేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీశైలానికి ఎటువంటి ఇన్ ఫ్లో ఉండట్లేదు. ఆయకట్టు పరిధిలో అవసరాల కోసం 25,686 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయం కూడా గత ఏడాది స్థాయి కన్నా తగ్గి 71.87 టీఎంసీలకు చేరింది.

స్పష్టంగా కళ్లకు..
పెన్నానదిపై నిర్మించిన సోమశిలలో గత ఏడాది 73.19 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం 19.12 టీఎంసీలే ఉంటోంది. కండలేరులో 57.33 టీఎంసీల నుంచి 17.19 టీఎంసీలకు పడిపోయింది. పులిచింతలలో 28.96 టీఎంసీలు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 8.75 టీఎంసీల నిల్వలు మాత్రమే మిగిలాయి. ఈ గణాంకాలు రాష్ట్రంలో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడి పరిస్థితులను స్పష్టంగా కళ్లకు కడుతున్నాయి.
మందగించిన ఖరీఫ్ సాగు..
ఈ తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల ఖరీఫ్ సాగు కూడా గణనీయంగా మందగించింది. సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా సాగు కావాల్సిన విస్తీర్ణం కంటే తక్కువగా పంటలు రికార్డయ్యాయి. సాధారణ విస్తీర్ణం 30.84 లక్షల హెక్టార్లు కాగా, ప్రస్తుతం 26.79 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు విత్తనాలు వేశారు. ఇది సాధారణ సాగుతో పోలిస్తే దాదాపు 88 శాతంగా రికార్డయింది. 12 శాతం తక్కువ సాగు విస్తీర్ణం నమోదైందీ ఏడాది.
రైతుల్లో దైన్యం..
ఖరీఫ్ ముగింపు సమయానికి నీటి లభ్యత ఇంతగా పడిపోవడం రాబోయే రబీ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు చెబుతున్నారు. సాధారణంగా ఖరీఫ్ తర్వాత కురిసే అక్టోబర్ వర్షాలు, ప్రాజెక్టుల నీటి నిల్వల ఆధారంగా రబీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని, ఈ సారి నాగార్జున సాగర్, శ్రీశైలం, సోమశిల వంటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు సగానికి పైగా పడిపోవడంతో రబీ డెల్టా పరిధిలోని ఆయకట్టుకు నీటి విడుదల క్లిష్టంగా మారొచ్చని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం ఏం చేయాలి..
ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ పంటల సంరక్షణకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాల్సి ఉంటుంది. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో పండే ప్రత్యామ్నాయ తృణధాన్యాలు, ఆరతడి పంటల వైపు రైతులను మళ్లించడంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలి. కరవు పరిస్థితులను అధిగమించే దిశగా ప్రణాళికలు రచించడం, సాగునీటి నిర్వహణను క్రమబద్ధీకరించడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది.
అధికారుల బాధ్యత ఏంటీ..
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన ఈ వర్షాభావ పరిస్థితులు, జలాశయాల నీటి నిల్వల కొరత రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి అతి పెద్ద పరీక్షగా నిలవనున్నాయి. ప్రభుత్వ సాగునీటి, వ్యవసాయ శాఖలు సమన్వయంతో స్పందించి తెగుళ్ల నివారణా చర్యలను వేగవంతం చేయాలి. నిరంతర క్షేత్ర స్థాయి పర్యవేక్షణ, ప్రణాళికాబద్ధమైన సహాయ కార్యక్రమాల ద్వారానే వర్షాల తీవ్రత తగ్గిన ప్రస్తుత తరుణంలో సాగును కాపాడుకోగలమని రైతులు స్పష్టం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications
