ఏపీలోని ఈ జిల్లాలు కకావికలం
ఏపీని వణికించిన మొంథా తీవ్ర తుపాను మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటింది. ఆ తర్వాత ఇది బలహీనపడింది. అయినప్పటికీ- నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు.
తుపాను ధాటికి విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, నంద్యాల జిల్లాలు కకావికలం అయ్యాయి. తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ లో భారీగా పంట నష్టం జరిగింది. ఈదురు గాలులు వీయడంతో చేతికి వచ్చిన పంట నేల కొరిగింది. విద్యుత్ సరఫరా స్తంభించిపోవడం వల్ల దివిసీమలో అంధకారం నెలకొంది. 1977 నాటి దివిసీమ ఉప్పెనను తలపించేలా ఈదురు గాలులు భయోత్పాతానికి గురి చేశాయి.

ఈదురు గాలులకు రోడ్లపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. స్థానిక శాసనసభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ పునరావస కేంద్రాలను పరిశీలించారు. వారికి అందుతున్న సహాయంపై ఆరా తీశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ దివిసీమ ప్రాంతంలో పర్యటించారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి డిస్కమ్ సిబ్బంది రాత్రంతా పని చేశారు.
నెల్లూరు జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. ఏఎస్ పేట మండలంలో వాగులు పొంగి ప్రవహిస్తోన్నాయి. నక్కల వాగు బ్రిడ్జి మీదుగా వరద పోటెత్తింది. దీంతో ఏఎస్ పేట - నెల్లూరు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే- తెల్లపాడు వాగు వద్ద రోడ్డుపై వరదనీరు ప్రవహించింది. ఫలితంగా ఏఎస్ పేట- ఆత్మకూరు మధ్య వాహనల రాకపోకలు స్తంభించిపోయాయి. ఎవరూ అటుగా వెళ్లకుండా ముళ్ళకంపను అడ్డుగా వేశారు.
అటు ఉయ్యూరులో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల ధాటికి చెట్లు విరిగి ఓ ఇంటిపై పడ్డాయి. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఉయ్యూరు శివార్లలోని కాకాణి నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఇళ్లల్లో నివాసం ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం వల్ల ముప్పు తప్పింది. చెట్లను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు
చిలకలూరిపేటలో సంజీవ్ నగర్ కాలనీ నీట మునిగింది. ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. విషపురుగులు వస్తాయనే భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటివరకు ఎవరూ ఈ కాలనీ వైపు రాలేదని స్థానికులు చెబుతున్నారు. వరదనీటిని తోడేయాలని కోరుతున్నారు. దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.
నందిగామలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పాత బస్టాండ్ సమీపంలోని రహదారిపై వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. అలాగే, డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications