టీటీడీలో ఆరోగ్యానంద ప్రారంభం
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక యోగా తరగతులను నిర్వహిస్తోంది. యోగా- టీటీడీ ఆరోగ్యానంద పేరుతో తలపెట్టిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని టీటీడీ కార్యనిర్వాహక అధికారి ముద్దాడ రవిచంద్ర తిరుపతి మహతి కళాక్షేత్రంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగ సాధన ద్వారా వ్యక్తి జీవితంలో సమతుల్యత, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని అన్నారు. టీటీడీ ఉద్యోగులందరూ క్రమం తప్పకుండా యోగ సాధనలో పాల్గొనాలని, యోగాభ్యాసం వల్ల ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు. ప్రారంభంలో యోగ కొంత కష్టంగా అనిపించినప్పటికీ, నిరంతర సాధన ద్వారా శరీరం, మనస్సుపై సంపూర్ణ నియంత్రణ సాధించవచ్చని చెప్పారు.

నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు, వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి యోగ సాధన అత్యంత అవసరమని అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. యోగ ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, భావోద్వేగ నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
భయం, ఆందోళన, ఉద్వేగాల వంటి ప్రతికూల భావోద్వేగాలను అధిగమించి మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు యోగ ఒక అద్భుతమైన సాధనమని వివరించారు. స్వామి వివేకానందుడు, గౌతమ బుద్ధుడు వంటి మహనీయులు యోగ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తు చేశారు.
యోగ అనేది కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక వికాసానికి మార్గదర్శకమని టీటీడీ జేఈవో డాక్టర్ ఏ శరత్ అన్నారు. యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 18, 19, 20 తేదీలలో ఉద్యోగులకు యోగ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 21న టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అంతకుముందు టీటీడీ పరిపాలనా భవనం, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, స్విమ్స్, బర్డ్, శ్వేత భవనం, ఎస్వీ సంగీత కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం తదితర కేంద్రాలలో ఉద్యోగులు, విద్యార్థులు, సిబ్బంది గంటపాటు యోగాసనాలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా మహతి కళాక్షేత్రానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం యోగా మాస్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సూర్యనమస్కారాలు, వివిధ యోగాసనాల ప్రదర్శన నిర్వహించారు.












Click it and Unblock the Notifications