దీపావళి వేళ.. విశాఖపట్నం విమాన ప్రయాణికులకు తీపి కబురు
విశాఖపట్నం విమాన ప్రయాణికులకు తీపి కబురు అందింది. ఢిల్లీకి మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దేశీయ పౌర విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరో విమానాన్ని నేడు ప్రారంభించింది. ఈ సర్వీస్ అందుబాటులోకి రావడంతో విశాఖ-ఢిల్లీ మార్గంలో ప్రయాణించే వారికి మరిన్ని ప్రయాణ అవకాశాలు లభించినట్టయిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
ఇప్పటివరకు విశాఖపట్నం, ఢిల్లీ నగరాల మధ్య ఇండిగో, ఎయిర్ ఇండియా మాత్రమే నేరుగా విమానాలను నడుపుతున్నాయి. ఇప్పుడు ఆకాశా ఎయిర్ ప్రవేశంతో ఈ రూట్‌లో ఫ్లైట్లను నడుపుతున్న మూడో విమానయాన సంస్థగా ఇది నిలిచింది. దీని వల్ల ప్రయాణికులకు సీట్ల లభ్యత గణనీయంగా పెరిగింది. ఉత్తరాంధ్రలో వైమానిక అనుసంధానాన్ని మరింత వేగవంతం చేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆకాశా ఎయిర్ మళ్లీ ఏపీకి తిరిగి వచ్చిందని, విశాఖ నుంచి ఢిల్లీకి తన విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడం పట్ల కింజరాపు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని నగరాలకు నేరుగా విమాన సర్వీసులను విస్తరింపజేసేందుకు తాము కృషి చేస్తోన్నామని వివరించారు. మరోవైపు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల ఐటీ, ప్రైవేట్ కంపెనీలకు ఎంతగానో ఉపయోగం కలుగుతోందని చెప్పారు.
ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యార్థులు, పర్యాటకులకు ఎంతగానో మేలు జరుగుతోందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. ఢిల్లీకి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆకాశ ఎయిర్ విమానం ఎంతో ఉపయోగకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
More options for Vizag-Delhi flyers!Starting today, we have an added flight connecting Visakhapatnam to the National capital, with Akasa Air launching operations as the 3rd airline on the sector.Along with additional capacity, this will bring greater flexibility in timings and more travel options for passengers flying to and from Alluri Sitarama Raju Airport, Bhogapuram!@AkasaAir , welcome to Andhra Pradesh and back to the Vizag region after 3 years!
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) October 25, 2026
ఈ మార్గంలో ఆకాశా ఎయిర్ తన అత్యాధునిక బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలను వినియోగిస్తోంది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానం క్యూపీ 1842.. ప్రతిరోజూ తెల్లవారు జామున 5:55 నిమిషాలకు టేకాఫ్ అవుతుంది. ఉదయం 8:20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి బయలుదేరే విమానం క్యూపీ 1843 ఫ్లైట్ ఉదయం 9:05 నిమిషాలకు బయలుదేరి 11:30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications
