అక్కినేని: దసరా బుల్లోడు, తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వర రావు నటించిన దసరా బుల్లోడు సినిమా తెలుగు సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్ సెట్టర్. 1971లో వచ్చిన ఈ సినిమా ఆ దశకంలో యువతను ఉర్రూతలూగించింది. వాణిశ్రీ, అక్కినేని నాగేశ్వర రావు జంటగా నటించిన ఈ సినిమాలో నల్లవాడే, అమ్మమ్మ అల్లరి పిల్లవాడు అనే పాట అప్పుడు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అక్కినేని ఆ సినిమాలో ధరించిన చొక్కా ఓ ట్రేడ్ మార్క్ అయింది. ఈ సినిమాలో చంద్రకళ కూడా నటించింది. ఇది ముక్కోణపు ప్రేమ కథ.
ఆ తర్వాత పూలరంగడు కూడా అంతే స్తాయిలో ప్రేక్షకులను ఊపేసింది. అక్కినేని నాగేశ్వర రావు వాణిశ్రీ జంట ఆ కాలంలో యువతను కిర్రెక్కించింది. ప్రేమనగర్ సినిమాలో ఈ జంట ప్రేక్షకులను మెప్పించింది. కడవెత్తుకొచ్చిందీ కన్నె పిల్ల అనే పాట ఇప్పటికీ తెలుగులో మారుమోగుతూనే ఉంది. వాణిశ్రీతో కలిసి చెంగావి రంగు చీర కట్టుకున్న అనే పాటకు అక్కినేని చేసిన నృత్యం అప్పటి యువత హృదయాలను దోచుకుంది.
ప్రేమికుడి పాత్రకు అక్కినేని నాగేశ్వరరావు పెట్టింది పేరుగా మారారు. ఓ రకంగా ట్రాజెడీ హీరో పాత్రలను ఆయన పోషించారు. అనార్కలి, లైలా మజ్ను వంటి అమర ప్రేమికుల కథల ఆధారంగా తీసిన సినిమాల్లో కథానాయకుడి పాత్రను పోషించి మెప్పిచారు.
బాలరాజు, కీలుగుర్రం వంటి జానపద కథా చిత్రాల్లో కూడా అక్కినేని నాగేశ్వర రావు నటించి మెప్పించారు. ఆయన పలు సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొట్టాయి. డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం, మేఘ సందేశం వంటి చిత్రాల్లో అక్కినేని నాగేశ్వర రావు ప్రేమికుడిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.













Click it and Unblock the Notifications