టీడీపీ నుంచి నాకు విముక్తి ప్రసాదించండి..ఆలపాటి సంచలన కామెంట్స్
సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. జనసేన, బీజేపీతో పొత్తు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. టికెట్ ఆశించిన నేతలకు మొండిచేయి ఎదురుకావడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు.
నాలుగున్నరేళ్లు పార్టీ కోసం తమతో భారీగా ఖర్చు చేయించి.. తీరా ఎన్నికల సమయానికి టికెట్లు వేరే వారికి కేటాయించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో టీడీపీలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. గంటా, దేవినేని, ఆలపాటి వంటి సీనియర్ నేతలకు మొండిచేయి ఎదురైంది.

తనకు టికెట్ కేటాయించకపోవడంపై పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. శుక్రవారం కార్యకలతో సమావేశం నిర్వహించిన ఆలపాటి టీడీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
నాకు ఈ పార్టీ నుంచి విముక్తిని ప్రసాదించమని అధినాయకత్వాన్ని కోరుకుంటున్నానని ఆలపాటి తన ఆవేదనను బయటపెట్టారు. గుంటూరు వెస్ట్‌తో పాటు పెనమలూరు నియోజకవర్గంలో నాపై పార్టీ సర్వే చేయించింది. గుంటూరు వెస్ట్, పెనమలూరులో నాకు అనుకూలంగా సర్వే రిపోర్ట్‌లు వచ్చాయి. అయినా పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయం తనను అత్యంత బాధాకు గురిచేసిందని ఆలపాటి కార్యకర్తల సమావేశంలో వాపోయారు.

పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో నేను కార్యకర్తల్లోకి వెళ్ళలేకపోతున్నాను. నేను సమర్ధుడిని కాదేమో అని కార్యకర్తలను చర్చించుకుంటున్నారు. చివరకు భార్య మొహం కూడా చూడలేకపోతున్నాను. ఇలాంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మీరందరూ నా నాయకత్వాన్ని కోరుకుంటే నాయకత్వం వహిస్తా లేదంటే రాజకీయల నుంచి తప్పుకుంటానని ఆలపాటి కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆలపాటి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్న తమ మద్దుతు ఉంటుందని కార్యకర్తలు ఆయనకు భరోసా ఇచ్చారు. ఆలపాటి టీడీపీని వీడితే ఆ ప్రభావం మూడు, నాలుగు నియోజకవర్గాలపై పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఆలపాటి టీడీపీని వీడుతున్నారనే సమాచారం అందుకున్న పార్టీ అధిష్టానం వెంటనే అప్రమత్తం అయింది.
దీనిలో భాగంగానే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జనసేన బోనబోయిన శ్రీనివాస యాదవ్ , పలువురు టీడీపీ నాయకులు ఆలపాటి నివాసానికి చేరుకుని ఆయన్ను బుజ్జగించే పనిలో పడ్డారు. మరి టీడీపీ టీడీపీ నేతలు చెప్పిన మాటలకు ఆలపాటి రాజీనామాపై వెనక్కి తగ్గుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఆలపాటి టీడీపీని వీడితే.. తెనాలిలో జనసేన గెలుపు కష్టమనే సంకేతాలు అందుతున్నాయి.












Click it and Unblock the Notifications