ఏపీ పింఛన్ దారులకు అలెర్ట్: ఏప్రిల్ నెలలో పింఛన్ డబ్బులు ఆలస్యం.. ఇచ్చేది అప్పుడే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన విషయాన్ని సూచించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద అందించే పింఛన్లను ఏప్రిల్ నెలలో కాస్త ఆలస్యంగా అందిస్తున్నట్టు పేర్కొంది. ప్రతినెల 1వ తేదీన పింఛన్లను ఇచ్చే ఏపీ ప్రభుత్వం, ఏప్రిల్ నెలలో మాత్రం పింఛన్ ను ఏప్రిల్ మూడవ తేదీ నుండి పంపిణీ చేయనున్నట్టు పేర్కొంది.
మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి, ఏప్రిల్ ఒకటి నుండి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న కారణంగా, ఇక రెండవ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయని కారణంగా, మూడవ తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో ఇంతియాజ్ వెల్లడించారు. ఒకటవ తేదీన తమకు పింఛన్ రాలేదని లబ్ధిదారులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పింఛన్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నెలలో పింఛన్ పంపిణీ తేదీ మార్పుని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందే ఏపీ క్యాబినెట్ సమావేశం తర్వాత ఈ విషయాన్ని వెల్లడించిన మంత్రి, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసేలా చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుండి వృద్ధాప్య పింఛన్ ను ఏపీ ప్రభుత్వం పెంచింది. 2750 రూపాయలకు పెంచి జనవరి ఒకటో తేదీ నుండి పంపిణీ చేస్తుంది. అంతకుముందు 2500 రూపాయలు ఉండగా ఇప్పుడు 50 రూపాయలు పెంచి పెన్షన్ అందిస్తున్నారు.
2024 జనవరి నాటికి మూడు వేల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అంతేకాదు లబ్ధిదారులు ఒక చోట నుండి మరొక చోటికి తమ నివాసాన్ని మార్చుకున్నా, పింఛన్ కూడా అక్కడికి మార్చుకునేలా నిర్ణయం తీసుకుంది .ఈ మేరకు లబ్ధిదారులు తమ వివరాలతో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకొని, పింఛన్ ను మార్చుకోవచ్చు. ఇక ప్రతి విషయాన్ని పింఛన్ లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపడుతున్న జగన్ సర్కార్ ఈసారి ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఏప్రిల్ నెలలో రెండు రోజులు ఆలస్యంగా పింఛన్ ఇవ్వనున్నట్టు తెలియజేసింది.












Click it and Unblock the Notifications