ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం: అలీ సోదరుడికి గాయాలు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఔటర్ రింగు రోడ్డులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలుగు హాస్య నటుడు అలీ సోదరుడు ఖయ్యూంకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని కోహెడ ప్రాంతంలో రింగు రోడ్డు నుండి ఖయ్యూం స్కార్పియో కారులో వెళ్తుండగా ఓ టిప్పర్ ఢీకొంది. దీంతో ఖయ్యూంతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

మరోవైపు బుధవారం తెల్లవారుజామున వేర్వేగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండకు చెందిన ముగ్గురు తమిళనాడులో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ నెల 22న వారు మదనపల్లి నుండి బయలుదేరి అయ్యప్ప స్వామిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఆగి ఉన్న లారీని మినీ బస్సు ఢీకొంది.
ప్రకాశం జిల్లాలో సంతమాగలూరు వద్ద సుమోను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరికి గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లా తిరువూరు బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరువూరు రాజపేటకు చెందిన వెంకటకృష్ణ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. తన స్నేహితుడితో కలిసి బైక్ పైన వెళ్తుండగా బైపాస్ రోడ్డు పెట్రోలు బంకు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు.












Click it and Unblock the Notifications