రేపు బీఆర్ఎస్ లోకి ఏపీ కీలక నేతలు - అమరావతికి సీఎం కేసీఆర్ : టార్గెట్ ఫిక్స్..!!
ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ లోకి ఏపీ కీలక నేతలు. గత నెలలో కేసీఆర్ తన బీఆర్ఎస్ ను అధికారికంగా ప్రారంభించారు. ముందుగా పొరుగు రాష్ట్రాల్లో విస్తరణకు నిర్ణయించారు. ఏపీతో పాటుగా కర్ణాటక..మహారాష్ట్రలపైన ఆయన ఫోకస్ పెట్టారు. ఏపీ- తెలంగాణ రాజకీయాలు ముడి పడి ఉండటంతో ఇప్పుడు ఏపీకి చెందిన కొందరు ప్రముఖ నేతలు కేసీఆర్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇందుకు రేపు మంచి రోజు కావటంతో గులాబీ పార్టీలోకి చేరాలని నిర్ణయించారు. ఇక, ఏపీలో కేసీఆర్ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ప్రస్తుత చేరికల ద్వారా ఏపీలో కేసీఆర్ టార్గెట్ ఏంటనేది స్పష్టత వస్తోంది.

బీఆర్ఎస్ లోకి ఏపీ ముఖ్య నేతలు..
బీఆర్ఎస్ లో ఏపీ విస్తరించే క్రమంలో ఇప్పటికే పలువురు నేతలు సీఎం కేసీఆర్ తో టచ్ లోకి వెళ్లారు. ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాల్లో భాగంగా కేసీఆర్ ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలనే అంశం పైన కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. రేపు ముహూర్త పరంగా మంచి రోజు కావటంతో ఏపీ రాజకీయాల్లో ఉన్న పలువురు నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకోవటానికి సిద్దమయ్యారు. అందులో జనసేనలో అధినేత పవన్ కు కుడిభుజంగా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రావెల కిషోర్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరో ముగ్గురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తోట చంద్రశేఖర్ కొంత కాలంగా జనసేన వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఐటి కంపెనీ అధినేతగా.. ఒక మీడియా సంస్థ అధిపతిగా ఉన్న తోట చంద్రశేఖర్ ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్లాలని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రజారాజ్యం, వైసీపీ, 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

సీఎం కేసీఆర్ సమక్షంలో చేరికలు..
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కైడా బీఆర్ఎస్ చేరటం ఖాయంగా కనిపిస్తోంది. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2017లో మంత్రివర్గ విస్తరణలో పదవి పోవటంతో పార్టీకి రాజీనామా చేసారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత బీజపీలో చేరారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్దసారధి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. రావెల కొద్ది నెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసారు. ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ లో ఏపీలో బాధ్యతల స్వీకరణకు సిద్దమయ్యారు. వీరిద్దరితో పాటుగా మరో ముగ్గురు గతంలో జనసేనలో పని చేసిన వారు కేసీఆర్ సమక్షంలో రేపు (సోమవారం) మధ్నాహ్నం గులాబీ కండువా కప్పుకోనున్నారు. వీరితో పాటుగా అనుచర వర్గం కూడా పార్టీలో చేరేందుకు సిద్దమైంది. దీని ద్వారా ప్రధానంగా టీడీపీ - జనసేన మాజీ నేతల పైన బీఆర్ఎస్ గురి పెట్టినట్లు స్పష్టం అవుతోంది. అయితే, రాయలసీమకు చెందిన ఒక కీలక నేత కుటుంబం కూడా కేసీఆర్ తో టచ్ లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.

అమరావతికి సీఎం కేసీఆర్..
జనవరి నెలాఖరులోగా సీఎం కేసీఆర్ అమరావతికి రానున్నట్లు తెలుస్తోంది. విజయవాడ సమీపంలో పార్టీలో చేరిన నేతలు..చేరనున్న నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ ఏర్పాటు లక్ష్యంతో పాటుగా ఏపీలో తన పార్టీ విధి విధానాలను వివరించనున్నారు. కడప జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేతతో పాటుగా.. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు బీఆర్ఎస్ లో చేరే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఈ నేతలు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు చేరికలు మొదలు అవ్వటంతో..ఈ నేతలు ఇక ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ కు ఎవరెవరు దగ్గరయ్యే అవకాశం ఉందనే లెక్కల్లో ప్రధాన పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. దీంతో..ఈ నెల రోజుల్లో ఏపీ కేంద్రంగా బీఆర్ఎస్ యాక్టివిటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications