ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ కీలక పరిణామాలు, ఇక సమరమే..!!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. బీసీ రిజర్వేషన్ల అమలు పైన ప్రత్యేకంగా జీవో జారీ చేసి.. వెంటనే ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు జరుగుతోంది. ఎన్నికల పైన ప్రభుత్వం ఇప్పటికే సమాయత్తం అవుతోంది. ఇదే సమయంలో అటు ప్రతిపక్షాలు సైతం స్థానిక ఎన్నికల పైన ప్రభుత్వ వ్యూహాలను గమనిస్తున్నాయి. రిజర్వేషన్లు ఖరారు అయినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. కాగా, ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే.. మరోవైపు ఎన్నికల నిర్వహణ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆపై ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఆ తరువాత వరుసగా ఎన్నికల షెడ్యూల్.. నోటిఫికేషన్ జారీకి వీలుగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిజర్వేషన్లను ఖరారు చేయగా.. గ్రామ, మండల, జడ్పీటీసీల వారీగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణ పైన సిబ్బంది.. సామాగ్రి రెడీ చేస్తున్నారు.

ఇక ఎన్నికల నిర్వహణకు అవసరమైన శిక్షణకు కూడా సిద్ధంగా ఉండాలంటూ పంచాయతీరాజ్ శాఖ నుంచి జిల్లాల కలెక్టర్లకు, ఎంపీడీవోలు సహా ఇతర అధికార యంత్రాంగానికి సందేశాలు వెళ్లాయి. మరోవైపు గ్రామాల వారీగా అవసరమైన బ్యాలెట్ బాక్సులు, అత్యవసరం కోసం వినియోగించేందుకు కూడా ఉండేలా బాక్సులను ఇప్పటికే మండలాలకు చేరవేసినట్టు సమాచారం. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, ఆ తరువాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సర్పంచ్ ఎన్నికలు రెండు దశల్లో ఉండే అవకాశం ఉంది. అటు క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు ఈ దఫా మారబోతున్నాయనే అంచనాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.












Click it and Unblock the Notifications