టీడీపీలోకి ఇద్దరు వైసీపీ ఎంపీలు - చంద్రబాబు కీలక హామీ..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీల పైన టీడీపీ గురి పెట్టింది. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. వైసీపీ నుంచి 11 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయినట్లు సమాచారం. ఆ ఇద్దరూ పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. టీడీపీలోకి వస్తే దక్కే ప్రాధాన్యత గురించి హామీ పొందారు. దీంతో, ఈ ఇద్దరు ఎంపీలు పార్టీ వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీకి గుడ్ బై
వైసీపీని వీడేందుకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు నిర్ణయించారు. జగన్ తో తొలి నుంచి రాజకీయంగా ప్రయాణం చేసిన మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరటం దాదాపు ఖాయమైంది. వైఎస్సార్ తో పాటుగా జగన్ మంత్రివర్గంలోనూ మోపిదేవి మంత్రిగా పని చేసారు. జగన్ కేసుల్లో భాగంగా వాన్ పిక్ కేసులో మోపిదేవి జైలు శిక్ష అనుభవించారు. 2019 ఎన్నికల్లో ఓడినా మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి జగన్ మంత్రిగా చేసారు. ఆ తరువాత రాజ్యసభకు పంపారు. ఇక, 2024 ఎన్నికల్లో మోపిదేవి సొంత నియోజకవర్గం రేపల్లె నుంచి ఈపూరు గణేష్ కు జగన్ తమ పార్టీ అభ్యర్దిగా బరిలోకి దింపారు.

చంద్రబాబుతో భేటీ
ఎన్నికల ఫలితాల తరువాత మోపిదేవి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పారిశ్రామిక వేత్తతో కలిసి హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశం అయినట్లు సమాచారం. టీడీపీలోకి వస్తే మోపిదేవికి ఎమ్మెల్సీ, ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ పైన హామీ లభించినట్లు సమాచారం. అదే సమయంలో పారిశ్రామిక వేత్తగా ఉన్న మరో ఎంపీ రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చినా..ఆయనకే తిరిగి రాజ్యసభ సీటు ఇచ్చేలా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, మోపిదేవితో సహా ఈ ఎంపీ సైతం పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు.

టీడీపీలోకి ఎంట్రీ
మోపిదేవి తన నియోజకవర్గంలో తన అనుచర వర్గంతో సమావేశం ఏర్పాటు చేసారు. గతంలో రెండు సార్లు రేపల్లె నుంచి గెలిచిన మోపిదేవి ఆ తరువాత వరుసగా ఓడిపోతున్నారు. అక్కడ నుంచి ప్రస్తుత మంత్రి అనగాని సత్యప్రసాద్ మూడు సార్లు విజయం సాధించారు. మారుతున్న రాజకీయ సమీకరణాలతోనే మోపిదేవి పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ముందుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తరువాత పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ తొలి వారంలో ఈ ఇద్దరు టీడీపీలో చేరటం లాంఛనంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications