శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - తిరుపతికి కొత్త విమాన సర్వీసులు, షెడ్యూల్..!!
Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త. నిత్యం తిరుపతికి పలు ప్రాంతాల నుంచి పలు మార్గాల్లో వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. విమానాలతో పాటుగా రైళ్లు, బస్సులు ఎన్ని ఏర్పాటు చేసిన భక్తుల రద్దీకి సరిపోవటం లేదు. కాగా, తిరుపతి నుంచి పలు ప్రాంతాలకు విమాన సర్వీసుల కోసం భక్తులు నేరుగా విమానయాన శాఖకు వినతులు సమర్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా గోదావరి జిల్లాల వాసులు నేరుగా తిరుపతి చేరుకునే విధంగా కొత్తగా విమాన సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసారు.
రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు అలయన్స్ ఎయిర్ సర్వీస్ సంస్థ తెలిపింది. వారానికి మూడు రోజులు మాత్రమే విమాన సర్వీసు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.వారంలో మంగళ, గురు, శనివారాల్లో రాజమండ్రి నుంచి తిరుపతికి విమానాలు నడవనున్నాయి. రాజమండ్రి నుంచి ఉదయం 9.40 గంటలకు బయల్దేరి 11.20 గంటలకు తిరుపతికి చేరుతుంది. ఇక తిరుపతి నుంచి ఉదయం 7.40 గంటలకు బయల్దేరి ఉదయం 9.25 గంటలకు రాజమండ్రికి చేరనుంది. ఈ మేరకు అలయన్స్ ఎయిర్ సర్వీస్ అధికారులు వివరాలు వెల్లడించారు.

ఇప్పటికే గోదావరి జిల్లాల నుంచి తిరుపతికి అదనపు రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. దీంతో, భీమవరం నుంచి కొత్తగా చెన్నైకు ప్రారంభించనున్న వందేభారత్ ను తిరుపతి మీదుగా నడపేలా రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక.. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానాల ద్వారా కొందరు ప్రయాణీకులు తిరుపతి చేరుకోవటంలో ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రి నుంచి అదనపు విమాన సర్వీసులను తిరుపతికి అందుబాటులోకి తీసుకురావాలని చాలా రోజులు గా ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం ఇదే అంశం పైన నేరు గా మంత్రాంగం సాగించారు. అయితే, ప్రస్తుతం అలయెన్స్ విమానయాన సంస్థ నేరుగా తిరుపతికి రాజమండ్రి నుంచి కొత్తగా సర్వీసును ప్రారంభిస్తోంది. ప్రయాణీకుల స్పందనకు అనుగుణంగా రెగ్యులర్ సర్వీసుగా మార్చే అంశం పరిశీలన చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విమాన సర్వీసుతో తిరుపతికి వెళ్లే భక్తులకు వెసులుబాటు కలగనుంది.












Click it and Unblock the Notifications