కూటమిలో జెడ్పీ స్థానాలు ఎవరికెన్ని - ఎవరు ఎక్కడ...!!
కూటమిలో జెడ్పీ స్థానాల సర్దుబాటు పైన కసరత్తు కొలిక్కి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో తాము అనుకున్న స్థానాలు రాకపోవటంతో జెడ్పీ స్థానాల పైన పవన్ పట్టు బడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి కేటాయించే సీట్ల పైన దాదాపు స్పష్టత వచ్చింది. మొత్తం 28 జెడ్పీ స్థానాల్లో జనసేన తాము కోరుకునే స్థానాల జాబితా ప్రతిపాదించింది. టీడీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో జనసేన కోరుతున్న సీట్ల పైన చర్చ జరుగుతోంది. ఈ సాయంత్రానికి జాబితా ఖరారు చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు.
జెడ్పీటీసీ- ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేనకు 4, బీజేపీకి రెండు కార్పోరేషన్లు దక్కాయి. కాగా.. జెడ్పీ స్థానాల విషయంలో ఈ రెండు పార్టీల నుంచి అంత కంటే ఎక్కువ శాతం కేటాయించాలని డిమాండ్ వచ్చింది. దీంతో..సీఎం చంద్రబాబు తొలుత పవన్, ఆ తరువాత మాధవ్ తో చర్చలు చేసారు. బీజేపీకి 30 జెడ్పీటీసీ, 30 ఎంపీపీ పదవులతో పాటుగా 100 ఎంపీటీసీ స్థానాలు ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా జనసేన తమకు 30 శాతం కేటాయించాలని కోరుతోంది. ఏడు జెడ్పీ స్థానాలు ఇవ్వాలని పవన్ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అయితే.. టీడీపీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడి గురించి చంద్రబాబు ఈ భేటీలో వివరించినట్లుగా తెలుస్తోంది. మూడు రీజియన్ల వారీగా జనసేనకు ఆరు స్థానాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నారని పార్టీ నేతల సమాచారం.

తుది జాబితా పై కూటమి కసరత్తు
అందులో భాగంగా అల్లూరి జిల్లా జెడ్పీ సీటు జనసేన తమకు ఇవ్వాలని కోరుతోంది. దీని పైన సానుకూల స్పందన వచ్చినట్లు చెబుతున్నారు. అదే విధంగా కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ప్రకాశం, తిరుపతి, అనకాపల్లి జిల్లాలు జనసేన కోటాలోకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతల అంచనా. కాగా.. ఏలూరు, ప్రకాశం జిల్లాల కోసం టీడీపీ నుంచి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. దీంతో పాటుగా జెడ్పీటీసీ స్థానాల కోసం పెద్ద ఎత్తున మూడు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేయటంతో.. మూడు పార్టీల నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుగా మూడు పార్టీలకు జెడ్పీటీసీలు ఖరారు చేసి... అక్కడ నిర్ణయించిన పార్టీ అభ్యర్ధే బరిలో ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఈ రోజున కమిటీ ప్రకటించేలా తుది కసరత్తు జరుగుతోంది. ఇక, ఈ రాత్రికి జెడ్పీ ఛైర్మన్ సీట్ల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
