పుష్ప-2 సినిమాను కిచిడీ కిచిడీ చేస్తున్న అల్లు అర్జున్, సుకుమార్?
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన ఈ సినిమా బాలీవుడ్ లో రూ.100 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. అన్ని భాషల్లో విజయవంతమవడంతో పుష్ప-2 చిత్ర యూనిట్‌పై బాధ్యత మరింత పెరిగింది.

కథలో మార్పులు, చేర్పులు
దీంతో ముందుగా అనుకున్న కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. అనుకున్న కథప్రకారం స్క్రిప్ట్ పని పూర్తిగా చేసుకొని షూటింగ్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని, కానీ ఇటీవల విడుదలైన RRR, KGF-2 సినిమాల ప్రభావం తర్వాత సినిమాలపై పడుతుండటంతో దర్శకులు, కథానాయకులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ రెండు సినిమాలతో పోల్చుకుంటూ..
దీనివల్ల తీసిన సన్నివేశాలనే మళ్లీ తీయడం, కథలో మార్పులు, కథానాయకుడి ఎలివేషన్ సన్నివేశాలవంటివన్నీ మళ్లీ మళ్లీ తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆచార్య విషయంలో కూడా ఇదే పొరపాటు జరిగింది. కరోనాకు ముందు షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా ఆరునెలల్లోగా విడుదలై ఉంటే ఫలితం ఎలా ఉండేదోకానీ.. RRR, KGF-2 చూసి రీటేక్‌లు తీసుకొని, సన్నివేశాలు మార్చుకొని రావడంతో విడుదలైన మొదటి ఆటకే ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

కథలో బలం ఉంటే చాలు
ఇప్పుడు పుష్ప చిత్ర యూనిట్ కూడా ఇదే పనిచేస్తోందని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. గత చిత్రాలతో సంబంధం లేకుండా దర్శకుడు మొదటి నుంచి ఏ కథ అనుకున్నారో, ఏ స్క్రిప్ట్ అయితే సిద్ధం చేసుకున్నారో దాంతో సినిమా తీస్తే ఇబ్బంది ఉండదని, కానీ పులిని చూసి నక్క వాతపెట్టుకున్న రీతిలో ప్రతి సినిమాలకు ఆ రెండు సినిమాల్లా ఎలివేషన్స్ కావాలంటూ కూర్చుంటే కష్టమవుతుందనే అభిప్రాయం వినపడుతోంది. కథలో బలం, స్క్రిప్ట్ పై పట్టు ఉంటే ఏ సినిమా అయినా విజయవంతమవుతుందని, ఇతర సినిమాలతో పోల్చుకోకుండా తమ కథను నమ్ముకొని ముందుకు వెళితే విజయం దక్కుతుందని తెలుగు పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications