పార్టీ లేదా పుష్ప: జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
న్యూఢిల్లీ/అమరావతి: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప- ది రైజ్ సినిమాలో చూపిన నటనకు అతనికి ఈ అవార్డు వరించింది. ఈ సినిమాలో గంధపు చెక్కల వర్కర్‌గా, స్మగ్లర్‌గా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అల్లు అర్జున్.
చిత్తూరు యాసలో మాట్లాడుతూ అదరగొట్టాడు. తగ్గేదే లే.. అనే మేనరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఉత్తమ నటి అవార్డును ఇద్దరు బాలీవుడ్ టాప్ హీరోయిన్లు పంచుకున్నారు. ఆలియాభట్, కృతిసనన్ పేర్లను జాయింట్‌గా ఈ అవార్డు కోసం జ్యూరీ సభ్యులు ప్రకటించారు. గంగూబాయి కథియావాడి సినిమాలో వేశ్యగా అద్భుతంగా నటించింది ఆలియాభట్.

ఇదో బయోపిక్ మూవీ. మిమి సినిమాలో నటించిన కృతి సనన్‌కూ బెస్త్ యాక్ట్రెస్ అవార్డును అందజేశారు. ఆర్ఆర్ఆర్ అవార్డుల పంట పండించింది. కొమురం భీముడో.. పాటకు ఉత్తమ గాయకుడిగా కాల భైరవ అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్, బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డులు కూడా ఈ సినిమాకే లభించాయి. బెస్ట్ వీఎఫ్ఎక్స్, బెస్ట్ పాపులర్ మూవీ, బెస్ట్ బీజీఎం అవార్డుల తన ఖాతాలో వేసుకుంది ఆర్ఆర్ఆర్.
వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి జంటగా నటించిన ఉప్పెన.. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషించారిందులో. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులోని పాటలన్నీ హిట్ అయ్యాయి.
ఉత్తమ తమిళ సినిమాగా మానాడు ఎంపికైంది. శిలంబరాసన్ టీఆర్ అలియాస్ శింబు హీరో. కళ్యాణి ప్రియదర్శి, ఎస్‌జే సూర్య, ప్రేమ్‌జీ అమరన్ కీలక పాత్రలను పోషించారు. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. 2021లో విడుదలైన ఈ సినిమా సంచలనం రేపింది.
రక్షిత్ షెట్టి, సంగీత శృంగేరి జంటగా నటించిన చార్లీ 777 సినిమాకు ఉత్తమ కన్నడ చిత్రం అవార్డు లభించింది. కిరణ్ రాజ్ కే దర్శకుడు. చార్లీ అనే ఓ పెట్ డాగ్ చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ. క్యాన్సర్‌తో బాధపడుతూ మరణానికి చేరువైన పెట్‌ను కాశ్మీర్‌కు తీసుకెళ్లడంతో సినిమా ముగుస్తుంది.
మలయాళీ సినిమా హోమ్.. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. దీపా థామస్, దేవ్ మోహన్, ఇందులో లీడ్ క్యారెక్టర్లను పోషించారు. ఇంద్రాన్స్, శ్రీనాథ్ భాసి.. కీలక పాత్రలను పోషించారు. రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. కుటుంబ బాంధవ్యాలను చూపించింది. బెస్ట్ హిందీ ఫిల్మ్- సర్దార్ ఉధమ్ సింగ్, బెస్ట్ గుజరాతీ ఫిల్మ్- చెల్లో షో ఎంపికయ్యాయి.












Click it and Unblock the Notifications