అమరావతిలో హెల్త్ స్ట్రీట్...వైద్య సేవలన్నీ ఒకే చోట...30 ఎకరాల్లో...
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వైద్య సేవలన్నీ ఒకే ప్రాంతంలో...అందరికి అందుబాటు ధరల్లో అందజేయాలన్న ఉద్దేశంతో 'అమరావతి హెల్త్ స్ట్రీట్' పేరుతో ఒక ప్రాజెక్టుకి సీఆర్‌డీఏ రూపకల్పన చేసింది. రాజధాని ప్రాంతంలో సుమారు 30 ఎకరాల్లో ఇది ఏర్పాటవుతుంది.
ఈ 30 ఎకరాల్ని వివిధ సైజుల్లో విభజించి ఆసుపత్రులు, ఇతర వైద్య,ఆరోగ్య సేవా కేంద్రాలకు కేటాయిస్తారు. టెండరు-వేలం విధానంలో ప్లాట్ల కేటాయింపు ఉంటుంది. ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు, ఆసుపత్రులతో పాటు, రోగ నిర్ధరణ కేంద్రాలు, ఔషధ దుకాణాలు, రెస్టారెంట్లు వంటివి ఈ హెల్త్‌స్ట్రీట్‌లో ఏర్పాటవుతాయి.

రాజాధానిలో హెల్త్‌స్ట్రీట్ కోసం కేటాయించిన 30 ఎకరాల్ని 14 రకాల పరిమాణాల్లో వివిధ ప్లాట్లుగా విభజిస్తారు. వీటిలో 269 చదరపు గజాల నుంచి మొదలై 1602 చదరపు గజాల వైశాల్యం వరకు స్థలాలు ఉంటాయి. 269 చదరపు గజాల వైశాల్యంగల స్థలాలు 40, 598 చదరపు గజాల వైశాల్యంగల స్థలాలు 41, 1,435 చదరపు గజాల వైశాల్యం గల స్థలాలు 10 ఉంటాయి. మిగతా వైశాల్యంగల స్థలాలన్నీ ఒకటి రెండు మాత్రం ఉంటాయి. 269 చదరపు గజాల స్థలంలో జీ 2, 517, 591 చదరపు గజాల స్థలాల్లో జీ 4 వరకు, మిగతా అన్ని కేటగిరీల స్థలాల్లో జీ 5 వరకు నిర్మాణాలకు అనుమతిస్తారు.
ఇక ఈ స్థలాలను వైద్యులు వ్యక్తిగతంగాను, ఇద్దరు, ముగ్గురు కలసి కన్సార్టియంగాను ఏర్పడి తీసుకోవచ్చు. హెల్త్‌స్ట్రీట్‌లో స్థలం వైశాల్యాన్ని బట్టి, సీఆర్‌డీఏ ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ణయించింది. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకునే వైద్యులకైతే ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం నెట్‌వర్త్ ఉండాలి. కన్సార్టియంగా ఏర్పడినట్లయితే అందులోని సభ్యులందరి నెట్‌వర్త్ కలసి ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం ఉండాలి. సొసైటీలు, ట్రస్ట్‌లు, స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలైతే...కనీసం 20 పడకల ఆసుపత్రిని ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న అనుభవం ఉండాలి.












Click it and Unblock the Notifications