తూర్పులోకి అమరావతి పాదయాత్ర-విపక్షాల సాయంతో అనూహ్య మద్దతు-సర్కార్ లో మూడుపై ధీమా

ఏపీలో అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని కోరుతూ రైతులు సాగిస్తున్న మహాపాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్నిదాటిన ఈ యాత్ర తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఇక మిగిలింది ఉత్తరాంధ్రే. దీంతో తూర్పుగోదావరి దాటాక పరిస్ధితులు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు విపక్షాలన్నీ మద్దతిస్తుండటంతో ఇప్పటివరకూ యాత్రకు రాజకీయంగా ఎలాంటి ఆటంకాల్లేకుండా పోయాయి.

 తూర్పులోకి అమరావతి పాదయాత్ర

తూర్పులోకి అమరావతి పాదయాత్ర

అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని కోరుతూ రైతులు చేస్తున్న పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమగోదావరి జిల్లాలోని దూబచర్ల దాటాక అయ్యవరంలో తూర్పుగోదావరి జిల్లాలోకి యాత్ర అడుగుపెట్టింది. దీంతో జిల్లా సరిహద్దుల్లోనూ రైతులకు ఘనస్వాగతం లభించింది.

ఇప్పటికే గోదావరి జిల్లాల్లో రాజకీయ పరిణామాలు మారుతున్న సంకేతాలు వెలువడుతున్న వేళ.. అమరావతి యాత్రకు లభిస్తున్న మద్దతు చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వం మాత్రం ధీమాగా కనిపిస్తోంది.

 విపక్షాల సాయంతో

విపక్షాల సాయంతో

అమరావతి రైతులు సాగిస్తున్న యాత్రకు ప్రధాన బలం దానికి అండగా నిలుస్తున్న విపక్షాలే. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇలా ఎక్కడికక్కడ బలంగా ఉన్న విపక్ష పార్టీలు అమరావతి యాత్రను ఓన్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీల పరంగా విధాన నిర్ణయాలు తీసేసుకున్న ఆయా పార్టీలు ఇప్పుడు ఈ యాత్రను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

దీంతో యాత్రలో పాల్గొనే వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాలు దాటిన ఈ యాత్ర ఇక త్వరలో ఉత్తరాంధ్రలోకి ప్రవేశించబోతోంది. దీంతో ఉత్తరాంధ్రలోనూ యాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్లాన్ చేస్తున్నారు.

 అనూహ్యంగా స్ధానికుల మద్దతు

అనూహ్యంగా స్ధానికుల మద్దతు

అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు గోదావరి జిల్లాల్లో సైతం అనూహ్య మద్దతు లభిస్తోంది. దీనికి ప్రధాన కారణం విశాఖ, కర్నూలు రాజధానుల వల్ల వీరికి ఎలాంటి ప్రయోజనం లేకపోవడమే. ముఖ్యంగా విశాఖలో రాజధాని పెట్టినా తమకు ఎలాంటి ఉపయోగంలేదని కొందరు భావిస్తుండగా.. అసలు మూడు రాజధానులు పూర్తి కావడంపైనే వారిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో ప్రస్తుత పరిస్ధితుల్లో ఉన్న రాజధానినే కొనసాగిస్తూ పనులు చేపట్టడమే మంచిదన్న భావన గోదావరి జిల్లాల్లో సైతం వ్యక్తమమవుతోంది. దీంతో పాదయాత్రకు స్ధానికంగా అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది.

 మూడు రాజధానులపై సర్కార్ ధీమా

మూడు రాజధానులపై సర్కార్ ధీమా

అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాల్ని విజయవంతంగా దాటింది. ఇప్పుడు నాలుగో ఉమ్మడి జిల్లా అయిన తూర్పుగోదావరిలో పయనిస్తోంది. దీని తర్వాత ఇక మిగిలింది ఉత్తరాంధ్ర మాత్రమే. తాము ప్రతిపాదిస్తున్న విశాఖ రాజధానికి మద్దతుగా స్ధానికులు గళం విప్పుతారని భావించిన ప్రభుత్వానికి వివిధ కారణాలతో ఆ పరిస్దితి కనిపించడం లేదు. అయితే ఓసారి మూడు రాజధానులు అమల్లోకి వస్తే మాత్రం ఈ పరిస్ధితి మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇప్పటికే అమరావతి పాదయాత్రకు లభిస్తున్న మద్దతుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం మంత్రులతో విమర్శలు చేయిస్తోంది. అయితే ఉత్తరాంధ్రలోకి ఎంట్రీ తర్వాత పరిస్ధితులపై ప్రభుత్వంలోనూ టెన్షన్ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+