Amaravati: రాజధాని రెండో దశ మాస్టర్ ప్లాన్- 50 గ్రామాలు, 1.75 లక్షల ఎకరాలు ..!!
అమరావతి కేంద్రంగా మరో కీలక నిర్ణయం జరిగింది. రాజధాని రెండో దశ విస్తరణ లో భాగంగా కీలక ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. ఇప్పటికే రెండో విడత భూ సమీకరణ మొదలైంది. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు కొనసాగుతోంది. ఇక.. రాజధాని విస్తరణలో భాగంగా రెండో దశలో ప్రభుత్వం 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్‌ప్లాన్ సిద్దం చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ అవసరాలు.. సమగ్రాభివృద్ధి కోసం ఈ ప్రణాళికలను అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
అమరావతి విస్తరణలో రెండో దశలో భాగంగా 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. ఈ పరిధిలో రెండో దశలో ప్రస్తుతం భూసమీకరణ చేస్తున్న ఏడు గ్రామాలు సహా మొత్తం 50 గ్రామాలు గుర్తించారు. కాగా, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయటంతో పాటుగా రహదారులు ..మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసి, రాజధానితో అనుసంధానించడం లక్ష్యంగా 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు 50 గ్రామాల్లోని భూములను రాజధాని కోసం తీసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం లాండ్ పూలింగ్ చేస్తున్న 7 గ్రామాల విస్తీర్ణం 20 వేల 494 ఎకరాలు. ఇది 82.9 చదరపు కిలోమీటర్ గా ఉంది. మిగతా 43 గ్రామాల్లోని భూముల విస్తీర్ణం లక్షా 54 వేల 853 ఎకరాల 43 సెంట్లు. మొత్తంగా రెండో దశలో లక్షా 75 వేల 347 ఎకరాలకు మాస్టర్‌ప్లాన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 43 గ్రామాల్లో గుంటూరు జిల్లాలో 29, పల్నాడు జిల్లాలో 14 ఉన్నట్లు తెలుస్తోంది.

విస్తరణ ప్రతిపాదనలు
అమరావతి రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం సీఆర్డీఏ ఆరు నెలలు గడువుగా నిర్దేశించారు. రెండో విడత లాండ్ పూలింగ్ కోసం 7 గ్రామాలకు సంబంధించి వివరణాత్మక మాస్టర్‌ప్లాన్‌తో పాటు, మిగతా 43 గ్రామాలకు స్ట్రక్చర్-ఇండికేటివ్ ప్లాన్ రూపొందించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న భూ సమీకరణ ప్రాంతంలో స్మార్ట్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వంటివి ఏర్పాటు చేయాల ని నిర్ణయించారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయి. అప్పటి అవసరాలకు తగ్గట్టు మళ్లీ భూసమీకరణ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. రాజధానిని ఆనుకుని ఉన్న 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఇప్పుడు మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అమరావతిలో ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ప్రధాన రహదారుల్ని రెండో దశకు విస్తరించనున్నారు. వాటిలో కొన్ని రహదారుల్ని అవుటర్‌రింగ్ రోడ్డుతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications