బాబును అరెస్ట్ చేయకుంటే కేసీఆర్‌దే తప్పు!: అంబటి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబును అరెస్టు చేయకుంటే ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసినట్లే భావిస్తామన్నారు. వైస్రాయ్ ఘటన నుండి చంద్రబాబు ఇలాంటివే చేశారన్నారు. చంద్రబాబును ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా వ్యక్తిగా చూసి అరెస్టు చేయాలన్నారు.
రూ.5 కోట్లు పెట్టి ఎమ్మెల్యేను కొనగల శక్తి చంద్రబాబుకు ఓలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేయకుంటే తెలంగాణ సర్కారుదే తప్పవుతుందని అన్నారు.

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్‌తో డీల్ కోసం తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జరిపిన సంభాషణల వీడియోలు లీకయ్యాయి. తెలుగు న్యూస్ చానెల్స్ వాటిని ఆదివారం రాత్రి ప్రసారం చేశాయి.
డీల్ కుదుర్చుకోవడానికి జరిపిన సంభాషణలతో పాటు స్టీఫెన్ సన్‌కు సంచుల్లో తెచ్చిన డబ్బులను చూపించి, నోట్ల కట్టలను టేబుల్‌పై సర్దిన దృశ్యాలను కూడా టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. సంచుల్లో తెచ్చిన డబ్బులను రేవంత్ రెడ్డి స్టీఫన్ సన్‌కు చూపించడమే కాకుండా వాటిని టేబుల్ మీద సర్దిపెట్టించిన దృశ్యాలను కూడా ప్రసారం చేశాయి.
వేయి, ఐదు వందల రూపాయల నోట్ల కట్టలను టేబుల్‌పై సర్దారు. తన బాస్ పంపిస్తేనే తాను వచ్చానని రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్‌తో చెప్పారు. ఏదైనా జరిగితే తనదే బాధ్యత అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడేమైనా ప్రాబ్లం వస్తే ఎపిలో చూపిస్తానని రేవంత్ రెడ్డి స్టీఫన్ సన్‌కు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications