రంగాను చంపారు, అందుకే ముద్రగడ విషయంలో ఆందోళన: అంబటి
హైదరాబాద్: వంగవీటి మోహనరంగాను తెలుగుదేశం పార్టీ గుండాలు చంపారని, కాపు నేత ముద్రగడ విషయంలోనూ అలాంటిది జరుగుతుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ముద్రగడను మీడియా ముందుకు తీసుకుని రావాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు.
ముద్రగడ విషయంలో ఉగ్రవాది కసబ్ కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు దౌర్డన్య పాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. ముద్రగడను పరామర్శించేందుకు వెళ్లిన తమను అరెస్టు చేయడమేమిటని ఆయన అడిగారు. రాజమండ్రిలో వందలాది మంది పోలీసులు ఉన్నారని, పరిస్థితి దారుణంగా ఉందని, అక్కడి పరిస్థితి చూస్తుంటే రాజమండ్రిలో ఉన్నామా పాకిస్తాన్‌లో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని అన్నారు.

బంద్ చేసేవాళ్లను కొడుతూ పోలీసులు బంద్‌ను విఫలం చేయడానికి ప్రయత్నించారని, సాధారణ పోలీసు అధికారి నుంచి ఐపిఎస్ అధికారి వరకు ఇలాగే వ్యవహరించారని, అసలు పోలీసుల విధులు ఇవేనా అని ఆయన అన్నారు. ముద్రగడను ఎవరు చూడాలనుకుంటే వారు చూసేందుకు వీలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏం జరుగుతుందో తెలియక ఆంధ్ర కాపు సోదరులంతా ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ముద్రగడతో వెంటనే చర్చలు జరిపి దీక్షను విరమింపజేసి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
సాక్షి టీవీ చానెల్ ప్రసారాలను నిలిపేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. తొలుత 21 రోజుల పాటు నోటీసులు ఇచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చెప్పాడనో, లోకేష్ చెప్పాడనో లేదా హోం మంత్రి చెప్పాడనో అలా చేయకూడదని ఆయన అన్నారు.
ప్రభుత్వాలు చెప్పినట్లు చానెళ్లు ప్రచారం చేయడం సాధ్యం కాదని, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా చానెల్ ప్రసారం చేసే తీరు మార్చుకోవాలా అని ఆయన అన్నారు. పాలకులకు అనుకూలంగానే చానెల్ ప్రసారాలు ఉండాలా అని ఆయన అడిగారు. నాలుగు రోజుల పాటు సాక్షి చానెల్ ప్రసారాలను ఎందుకు నిలిపేశారని ఆయన అడిగారు.
ప్రభుత్వం చెప్పిందని ఎంఎస్ఓలు ప్రసారాలు నిలిపేయడం ధర్మం, న్యాయం కాదని ఆయన అన్నారు. ప్రసారాలను పునరుద్ధరించాలని వారిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై చట్టపరమైన చర్యలకు దిగుతామని ఆయన చెప్పారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఆయన వారిని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications