చంద్రబాబు పై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబుకు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పదవి కోసం ఎన్టీఆర్‌ను గద్దె దించి ఇబ్బంది పెట్టి అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో పలికిన మాటల వీడియోలను విడుదల చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. తండ్రి లాంటి మామకు వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేసారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు లక్ష్యంగా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రస్తుతం టీడీపీ ఎన్టీఆర్ శతజయంతి వేడకులను నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే లో రాజమండ్రిలో నిర్వహించే మహానాడు వరకు వరుసగా కార్యక్రమాలను ఖరారు చేసింది. ఈ సాయంత్రం విజయవాడలో జరిగే కార్యక్రమంలో సినీ హీరో రజనీకాంత్, నందమూరి బాలయ్యతో పాటుగా చంద్రబాబు హాజరు కానున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించటం పైన అంబటి చంద్రబాబును ప్రశ్నించారు. ఇక, తాజాగా గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా సత్తెనపల్లి సభలో మాట్లాడిన చంద్రబాబు మంత్రి అంబటి పైన సీరియస్ కామెంట్స్ చేసారు. దీనికి అంబటి సైతం కౌంటర్ ఇచ్చారు.

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నిర్వహించిన సభలు ఫ్లాప్ అయ్యాయని రాంబాబు పేర్కొన్నారు. సత్తెనపల్లి సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని, 20 వేల కెపాసిటీ ఉన్న గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభకు కనీసం 3 వేల మంది కూడా రాలేదన్నారు. చంద్రబాబు సభకు సంబంధించిన గ్రౌండ్‌ను, జనాలే ఏ మేరకు సభకు హాజరయ్యారో మంత్రి అంబటి రాంబాబు వీడియోలు ప్రదర్శించి వివరించారు. చంద్రబాబు తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా చేసిన విమర్శలను రాంబాబు తప్పు బట్టారు. మోడీని తిడతారన,. అమిత్‌షా వస్తే రాళ్లు వేయించారని చెప్పుకొచ్చారు. బీజేపీని సర్వనాశనం చేస్తానని దేశంలోని రాష్ట్రాలన్నీ తిరిగారని గుర్తు చేసారు. మళ్లీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని అవసరమైతే మోడీ కాళ్లు పట్టుకుంటానని చెబుతున్నారని వివరించారు.
రాష్ట్రంలో రెండు లక్షల కోట్లకు పైగా ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించిన వ్యక్తి సీఎం జగన్ అని రాంబాబు చెప్పుకొచ్చారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి పేదలను ఎవరిని ధనవంతులను చేశాడని ప్రశ్నించారు. పోలవరం డయాఫ్రం వాల్ అంటే ఏంటో తనకు తెలియదని చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు చేసిన తెలివితక్కువతనం వల్ల పోలవరం ప్రాజెక్టు కుంటుపడింది. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించారని చెప్పారు. దాని వల్ల వరదలు వచ్చి కాఫర్ డ్యామ్ గ్యాప్‌ల నుంచి డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని వివరించారు. దీని మీద రెండు సంవత్సరాలు రీసెర్చ్ చేసి కొట్టుకుపోయిందాన్ని పరిష్కరించాలంటే రూ.2022 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదంతా చంద్రబాబు తప్పిదం వల్లే జరిగిందని రాంబాబు వివరించారు.












Click it and Unblock the Notifications