టార్గెట్ చంద్రబాబు : నేడు ఏపికి అమిత్ షా : రాజమండ్రిలో బహిరంగ సభ..
బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా మరి కొద్ద గంటల్లో ఏపి పర్యటనకు వస్తున్నారు. రాజమండ్రిలో ఆయన పార్టీ నేత లతో సమావేశం అవుతారు. బహిరంగ సభలోనూ పాల్గొంటారు. ఈ నెల 11న గుంటూరు సభలో ప్రధాని మోదీ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పదునైన విమర్శలు చేసారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట..అమిత్ షా సైతం ఏపి ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకొని ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజమండ్రికి అమిత్ షా..
బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాజమండ్రికి వస్తున్నారు. ఆయన కార్యకర్తలతో తొలుత మాటా మంతి లో పాల్గొని పార్టీ పరంగా అమలు చేస్తున్న..చేయాల్సిన కార్యాచరణను నిర్దేశించనున్నారు. ఏపికి కేంద్రం ఎటువంటి సాయం చే యకుండా మోసం చేసిందనే అధికార పార్టీ నేతల ఆరోపణల పైనా అమిత్ షా స్పందించే అవకాశం ఉంది. ఏపిలో గత పర్యటనల్లో అమిత్ షా కేంద్రం ఏ రకంగా సాయం చేసిందీ అంకెల తో సహా వివరించారు. ఇప్పుడు కార్యకర్తల సమావేశంలోనూ ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయించిందీ..ఏ రకంగా ఏపికి సహకారం అందించిందీ వివరించనున్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఏపిలో బిజెపి వ్యూహం ఏంటనేది షా కార్యకర్తలకు నిర్ధేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు లక్ష్యంగా..బహిరంగ సభలో..
ఇక, తమను ఏపిలోనూ..జాతీయ స్థాయిలోనూ లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పైనే అమిత్ షా గురి పెట్టే అవకాశం ఉంది. గత పర్యటనల్లోనూ ఆయన చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసారు. ఈ పర్యటనలోనూ తాజాగా పుల్వామా ఘటన పై ముఖ్యమంత్రి గత రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలపైనా అమిత్ షా స్పందిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. గుంటూరు పర్యటనలో మోదీ చేసిన విమర్శల కు కొనసాగింపుగా షా సైతం ప్రసంగిస్తారనేది పార్టీ నేతలు చెబుతున్న మాట. ఇక, మార్చి 1న ప్రధాని మోదీ విశాఖ సభలో పాల్గొననున్నారు. దీనికి ముందుగా ఏపికి వస్తున్న అమిత్ షా ఇక ఎన్నికల సమర శంఖం పూరించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 22న కాంగ్రెస్ అధినేత రాహుల్ సైతం ఏపికి రానున్నారు. దీంతో..అమిత్ షా ప్రసంగం పై ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications