వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు బెంగ అవసరం లేదు, ఇంకా ఇస్తాం: విమర్శలపై ఘాటుగా అమిత్ షా

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం తగినవిధంగా సహాయం చేయడంలేదని దుష్ప్రచారం జరుగుతోందని, రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలా సాయం చేస్తుందో చెప్పడానికే తానొచ్చానని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. ఆదివారం రాజమహేంద్రవరంలో బిజెపి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రానికీ చేయని విధంగా ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని ప్రకటించామని వెల్లడించారు. 'పవిత్ర గోదావరి నదీతీరంలో జరుగుతున్న సంకల్ప సభలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. దేశంలో 30 ఏళ్ల తర్వాత ఒక పార్టీకి కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చిందంటే అందులో ఆంధ్రప్రదేశ్‌ ఘనత కూడా ఉంది.

కేంద్రంలో ఎన్‌డిఏ అధికారంలో ఉన్నంత వరకు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని అమిత్ షా భరోసా ఇచ్చారు. విభజన చట్టంలోని అన్ని హామీలను ఎన్డీయే అమలు చేసి తీరుతుందని అమిత్‌షా హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శల్లో అర్ధంలేదన్నారు. రాష్ట్ర విభజనకు ముందే ఆర్డినెన్స్ ద్వారా ఏడు ముంపు మండలాలను ఆంధ్రలో విలీనం చేశామని, జీవన రేఖలాంటి పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్ణీత కాలంలోనే నిర్మించి తీరుతుందన్నారు.

Amit Shah Snubs Chandrababu Naidu Over Meagre Financial Allocation Barb

ఒకే ఏడాది ఒకే బడ్జెట్‌లో మొత్తం నిధులను కేటాయించటం సాధ్యంకాదన్నారు. ఈ విషయంలో ప్రజలను ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు విశాఖకు రైల్వే జోన్, విభజన చట్టంలోని ఇతర హామీలు, ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌కు మంజూరుచేసి తీరుతామన్నారు. ఈ విషయంలో ఆంధ్ర సీఎం చంద్రబాబు ఏమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదన్నారు.

కేంద్రంలో 30ఏళ్లుగా ఎప్పుడూ లేనంత బలాన్ని బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారని అమిత్ షా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పల్లె పల్లెలోనే కాకుండా, బూత్‌స్థాయిలోనూ బిజెపి బలోపేతమయ్యేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన శక్తిగా బిజెపి ఆవిర్భవించాలన్నారు.

దేశంలో ఏ దిక్కులోనూ కాంగ్రెస్ పార్టీ కనిపించ కూడదన్నారు. ఇప్పటికే 11కోట్ల మంది సభ్యులతో బిజెపి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. మిత్రపక్షమైన తెలుగుదేశం అధికారంలోవున్న ఆంధ్ర అభివృద్ధికి ఎన్డీయే కృషిచేస్తోందన్నారు.

ఇప్పటివరకు రూ.లక్ష 40వేల కోట్ల నిధులను ఆంధ్ర అభివృద్ధికి అందించినట్టు చెప్పారు. 24గంటల విద్యుత్ సరఫరా ప్రాజెక్టు, రోడ్ల నిర్మాణానికి రూ. 65వేల కోట్లు, లక్ష 93 వేల ఇళ్లు, రెండు స్మార్ట్ సిటీలు, రాజధాని నిర్మాణానికి రూ.1500కోట్లు తదితర అనేక ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

కేంద్రం ఆంధ్రకు మంజూచేసిన పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ సందర్భంగా అమిత్‌షా ప్రజలకు వివరించారు. 19నెలల కాలంలోనే ఎన్డీయే ఇంత చేస్తే, 60ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రకు ఏం చేశారో చెప్పగలరా? అని అమిత్‌షా ప్రశ్నించారు. ఎవరి బలమేమిటో ఎన్నికల్లో చూసుకోవాలే తప్ప, పార్లమెంటులో కాదని హితవు పలికారు.

ఏ రాష్ట్రంలో కావాలంటే ఆ రాష్ట్రంలో బలం చూసుకోవడానికి బిజెపి సిద్ధమేనని, అయితే పార్లమెంటును నిరోధిస్తే, అది ప్రజల అభివృద్ధి, ఆంధ్ర అభివృద్ధిని నిరోధించడమేనని అన్నారు. జెఎన్‌యులో దేశ ద్రోహులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వత్తాసు పలుకుతున్నారన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారికి అనుకూలంగా నినాదాలు చేయటం వాక్ స్వాతంత్య్రమా? అని అమిత్‌షా ప్రశ్నించారు.

కాగా, సభకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె హరిబాబు అధ్యక్షత వహించారు. సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, జెపి నడ్డా, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్‌సింగ్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు, ఎంపి గంగరాజు, మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావు, మాజీ కేంద్రమంత్రి యువి కృష్ణంరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

English summary
BJP president Amit Shah today snubbed Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu for "faulting" the Centre over "meagre" financial allocations to the state even as he sought his cooperation in development of AP in next five years "like never before".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X