ఇంజనీరింగ్ మిరాకిల్.. శ్రీశైలం నుంచి కుప్పం వరకు 700 కి.మీ. ప్రయాణించిన కృష్ణాజలాలు
పట్టుదలగా ఒక పనిని పూర్తిచేయాలనుకున్నప్పుడు అది అయిపోయేంతవరకు విశ్రమించకూడదు. అటువంటి లక్షణాలున్న చంద్రబాబునాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే 700 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన కృష్ణమ్మ కరవు నేల అయిన కుప్పంను ముద్దాడింది. అక్కడి ప్రజలు, రైతులు కాల్వల్లోకి దూకి, నీటిని ముద్దాడుతూ, కంటతడి పెడుతూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఇటువంటి ఇంజనీరింగ్ అద్భుతాన్ని సీఎం చంద్రబాబు ఎలా సుసాధ్యం చేశారో తెలుసుకుందాం.
ఇంజనీరింగ్ అద్భుతం
శ్రీశైలం నుంచి దాదాపు 700 కిలోమీటర్లు ప్రయాణించి, సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తున ఉన్న కుప్పం నేలను కృష్ణా జలాలు తాకడం ఒక అసాధారణమైన ఇంజనీరింగ్ మిరాకిల్. దశాబ్దాల కరువును పటాపంచలు చేస్తూ, రాయలసీమ చిట్టచివరి ఆయకట్టు దాహాన్ని తీర్చిన ఈ చరిత్రాత్మక విజయానికి 'హంద్రీ-నీవా సుజల స్రవంతి' HNSS పథకమే వెన్నుముకగా నిలిచింది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్ నుంచి మాల్యాల వద్ద నీటిని ఎత్తిపోతల ద్వారా హంద్రీ-నీవా కాలువలోకి మళ్లిస్తారు.

అక్కడి నుంచి ఈ ప్రధాన కాలువ కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేసి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ మార్గంలో HNSS రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కాలువ వద్ద గల 207.800 కిలోమీటరు పాయింట్ నుంచి ప్రత్యేకంగా "కుప్పం బ్రాంచ్ కాలువ" ప్రారంభమవుతుంది. ఈ కాలువ దాదాపు 131.2 కిలోమీటర్ల పొడవునా కాంక్రీట్ లైనింగ్‌తో పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ప్రవహిస్తుంది.
పైకి పంపడమే అతి పెద్ద సవాల్
భౌగోళికంగా కుప్పం అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో నీటిని పైకి పంపడం అతిపెద్ద సవాలుగా మారింది. శ్రీశైలం వద్ద నీటి మట్టం సుమారు 250 మీటర్లు కాగా, కుప్పానికి వచ్చేసరికి అది 800 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది. ఈ భౌగోళిక వ్యత్యాసాన్ని అధిగమించడానికి రామాపురం, క్రిష్ణదాసనపల్లె, రాజుపేటల వద్ద 3 భారీ పంపింగ్ స్టేషన్లు అంటే ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు చేసి, అత్యంత శక్తివంతమైన మోటార్ల ద్వారా నీటిని పైకి నెట్టారు. ఆపై గురుత్వాకర్షణ గ్రావిటీ శక్తితో 48 వాటర్ అవుట్‌లెట్ల ద్వారా నీటిని ముందుకు ప్రవహింపజేశారు. ప్రారంభంలో 216 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహ సామర్థ్యం చివరి విడతకు చేరుకునే సరికి 161 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.
4 లక్షల జనాభాకు తాగునీరు
ఈ సుదీర్ఘ ప్రయాణం చివరికి కుప్పం సమీపంలోని చరిత్రాత్మక పరమ సముద్రం చెరువుకు చేరడంతో పూర్తవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో పూర్తయిన ఈ ప్రాజెక్ట్ ద్వారా పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట, శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం వంటి మండలాల్లోని 400 కంటే ఎక్కువ మైనర్ ఇరిగేషన్ చెరువులు, కుంటలను నింపుతున్నారు. దీనివల్ల 6,300 ఎకరాలకు స్థిరమైన సాగునీరు అందడమే కాకుండా, 4.02 లక్షల జనాభాకు తాగునీరు లభిస్తోంది. పాత బోరు బావుల్లో భూగర్భ జలాలు మళ్లీ పుంజుకోవడంతో, ఈ ప్రాంతంలో కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులకు కృష్ణా జలాలు కొండంత అండగా నిలిచాయి.
భౌగోళిక సవాళ్లు, వందలాది కిలోమీటర్ల దూరం, ఎత్తైన కొండలు వంటి ప్రతికూలతలను చూసి "ఇది అసాధ్యం" అనుకున్న చోట... తన అంకితభావం, అచంచల సంకల్పంతో "సుసాధ్యం చేసి చూపించవచ్చు" అని నిరూపించిన నిజమైన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు. కుప్పం నేలపై కృష్ణమ్మను పరవళ్లు తొక్కిస్తూ, కరువు సీమలో జలసిరులు కురిపించిన ఈ చరిత్రాత్మక ఘట్టం ఆయన రాజకీయ ప్రస్థానంలోనే కాక, తెలుగు రాష్ట్రాల నీటిపారుదల చరిత్రలోనూ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.












Click it and Unblock the Notifications
