మీరు భయపడాల్సిన అవసరం లేదు.. నాతో రండి..?
నేదురుమల్లిని ఇన్ ఛార్జిగా నియమించిన తర్వాత ఆనం ప్రభుత్వంపై విమర్శలు మాని మౌనం పాటిస్తున్నారు
సీనియర్ రాజకీయవేత్త, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కొద్దిరోజులుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డిని పార్టీ ఇన్ ఛార్జిగా నియమించింది. ఒకవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ నడుస్తుండగా, మరోవైపు ఆనం ఎపిసోడ్ నడుస్తోంది.

మౌనం పాటిస్తున్న ఆనం
నేదురుమల్లిని ఇన్ ఛార్జిగా నియమించిన తర్వాత ఆనం ప్రభుత్వంపై విమర్శలు మాని మౌనం పాటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తన అనుయాయులతో ఆనం సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో తీసుకునే నిర్ణయానికి మద్దతుగా రావాలని కోరారు. తాజాగా సైదాపురం మండలానికి చెందిన నేతలతో నిర్వహించే ఈ సమావేశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆనం రామనారాయణరెడ్డి ఏం మాట్లాడతారు? అనే విషయంపై నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఆనం నిర్వహించే సమావేశం విషయం తెలియగానే రామ్ కుమార్ రెడ్డి వర్గం అప్రమత్తమైంది.

సమావేశానికి వెళితే బహిష్కరణే?
ఆనం సమావేశానికి నాయకులెవరూ వెళ్లొద్దని, వెళితే పార్టీ నుంచి బహిష్కరణ వేటు తప్పదని హెచ్చరించింది. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. సైదాపురానికి చెందిన జెడ్.పి.మాజీ వైస్ చైర్మన్ శిరీష వర్గం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. మరో వైపు రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారెడ్డితో పాటు పలువురు సర్పంచ్ లు..ఇతర నేతలు ఆనం రామనారాయణరెడ్డి సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. తన మనుషులు అనుకున్నవారంతా ఈ సమావేశానికి రావాలని, ఇతర నాయకుల బెదిరింపులకు బెదరాల్సిన అవసరం లేదని ఆనం వారికి ధీమా కల్పిస్తున్నారు. దీంతో సైదాపురం మండలం నుంచి ఎవరెవరు హాజరవుతారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం తర్వాత ఆనం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

పనికిరాకుండా పోయానంటున్న కోటంరెడ్డి
సింహపురి జిల్లా రాజకీయాలు నిత్యం రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నాయి. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తనపై ఇంటిలిజెన్స్ నిఘా ఉందన్నారు. పార్టీకోసం, జగన్ కోసం కష్టపడ్డానని, కానీ తన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు 12 సిమ్ కార్డులు మార్చినట్లు వెల్లడించారు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబాలకు మూడుతరాలుగా సేవ చేస్తున్న తాను ఈరోజున ఏ పదవికీ పనికిరాకుండా పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications