జనసేనలో చేరిన సినీ గేయ రచయిత కుటుంబం, మంత్రి ఇలాకా లో ఎన్నికల్లో పోటీ..!!
స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం సినీ ప్రముఖ గేయ రచయిత కుటుంబం ముందుకు వచ్చింది. జనసేనలో చేరింది. ప్రస్తుతం జరు గుతున్న ఎన్నికల్లో బరిలోకి దిగింది. పవన్ పైన అభిమానంతో తాము పార్టీలో చేరామని.. చెబుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు వీరి చేరిక అటు సినీ.. ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లా లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు జనసేన పార్టీలో చేరారు. శ్రీరామ్ తల్లి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గంలో సర్పంచ్‌గా పోటీచేయనున్నారు. అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి, ఉమారాణి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

సర్పంచ్ గా ఎన్నికల బరిలో
అనంత్ శ్రీరామ్ గతంలో జనసేన పార్టీ కోసం పాటలు కూడా రాసారు. కాగా, తన తల్లితండ్రులు జనసేన లో చేరిక పైన అనంత శ్రీరామ్ స్పందించారు. సర్పంచ్ ఎన్నికల్లో తమ గ్రామానికి మహిళ కు సర్పంచ్‌గా పోటీచేసే అవకాశం రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మరో ఆలోచనకు అవకాశం లేకుండా తన తల్లిని ఆ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రామం సంతోషించి ఏకగ్రీవం అయితే బావుంటుందని ప్రతి పాదన రావటంతో.. దానికి అనుగుణంగానే గ్రామంలోని పార్టీలు సానుకూలం గా స్పందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒక పల్లెటూరును బాగా అభివృద్ధి చేయాలంటే పంచాయతీ రాజ్ శాఖ చాలా ముఖ్యమని.. ఆ పంచాయతీరాజ్ శాఖలో నియమబద్ధంగా, నిష్టగా, ఒక పట్టుదల తో, అకుంఠిత దీక్షతో, అంకిత భావంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ ఉన్న పార్టీలో చేరడం గ్రామానికి శ్రేయస్కరమని తన తల్లిదండ్రులు నిర్ణయించారన్నారు.













Click it and Unblock the Notifications
