అసెంబ్లీ: కిరణ్ కుమార్ రెడ్డి మలుపు తిప్పుతారా?
హైదరాబాద్: శాసనసభ సమావేశాలు రేపటి నుంచి (శుక్రవారం నుంచి) ప్రారంభం కానున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీధర్ బాబును శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తప్పించి ఆ శాఖను సమైక్యాంధ్రకు నాయకత్వం వహిస్తున్న శైలజానాథ్‌కు అప్పగించడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్కంఠను మరింత పెంచారు. రేపటి నుంచి జరిగే శానససభా సమావేశాల్లో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతుందని ఇప్పటి వరకు అనుకుంటూ వస్తున్నారు. కానీ, ముఖ్యమంత్రి దానికి అనూహ్యమైన మలుపు ఇస్తారనే ఉత్కంఠ చోటు చేసుకుంది.
శాసనసభలో సమైక్య తీర్మానాన్ని ప్రతిపాదించడానికి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధపడ్డారని, అందుకే శాసనసభ వ్యవహారాల శాఖను శైలజానాథ్ చేతిలో పెట్టారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్య తీర్మానం ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. దీంతో ఆ పార్టీకి షాక్ ఇస్తూ, తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చాటుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి రేపటి సమావేశాలను అనూహ్యమైన మలుపు తిప్పుతారని ప్రచారం సాగుతోంది.

కిరణ్ కుమార్ రెడ్డిని జెసి దివాకర్ రెడ్డి, విజయ్ కుమార్, తూర్పు జయప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, ఎం రంగారెడ్డి కలిశారు. ఈ సమయంలో విభజన ఆగిపోతుందని, ఆ విషయంలో ఆందోళన పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. గురువారంనాడు మంత్రి శైలజానాథ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు.
సమైక్య తీర్మానాన్ని ప్రతిపాదించడం ద్వారా స్పీకర్ మనోహర్‌కు కూడా స్పాట్ పెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి చర్యను నాదెండ్ల మనోహర్ బహిరంగంగా వ్యతిరేకించలేక ఇబ్బందుల్లో పడుతారని అంటున్నారు. సమైక్యాంధ్ర తీర్మానం ప్రతిపాదిస్తే అది అతి సులభంగా ఆమోదం పొందుతుంది. సీమాంధ్ర శాసనసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అది నెగ్గడంలో ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండదు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారని, అందుకు కుట్ర చేశారని సీమాంద్ర కాంగ్రెసు సభ్యులు విమర్సిస్తున్నారు. ముఖ్యమంత్రి సభలో లేని సమయంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు అందుకు అనుగుణంగా వ్యవహరించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications