ఏపీలో ఎన్నికలు సమీపించిన వేళ.. వలంటీర్లకు కీలక బాధ్యతల అప్పగింత
Cast census: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కుల గణనకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కులాల వారీగా సర్వే చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామ/వార్డు స్థాయిలో సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు ఈ 10 రోజుల పాటు ప్రతి ఇంటికీ వెళ్తారు. కులాల వారీగా వివరాలను సేకరిస్తారు. ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుంది.
గ్రామ, వార్డు సచివాలయ మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న డేటా ప్రకారం 1,23,40,422 కుటుంబాలు గ్రామాల్లో నివసిస్తోన్నాయి. వ్యక్తిగతంగా తీసుకుంటే ఈ సంఖ్య 3,56,62,251కు చేరుతుంది. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలు నివసిస్తోన్నాయి. వారి సంఖ్య 1,33,16,091గా నమోదైంది.

సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు ఆయా కుటుంబాలకు వెళ్లి వివరాలను కులాల వారీగా సేకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్‌ను నిర్వహించింది జగన్ ప్రభుత్వం. ఆరు జిల్లాల్లో ఏడు సచివాలయాల పరిధిలో 3,323 కుటుంబాలకు చెందిన 7,195 మంది వివరాలను నమోదు చేశారు వలంటీర్లు.
శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, నెల్లూరు, కడప, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ పైలెట్ ప్రాజెక్ట్ పూర్తయింది. ఇదే తరహాలో ఈ 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుల గణన కార్యక్రమం కొనసాగుతుంది. కులగణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. దాదాపు 723 కులాల జాబితాలను మొబైల్ యాప్‌లో పొందుపరిచారు.
అగ్రవర్ణాలు, వెనుకబడిన సామాజిక వర్గంలోని అన్ని కేటగిరీలు ఇందులో ఉన్నాయి. అలాగే- ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ కేటగిరీలు ఈ యాప్‌లో ఉన్నాయి. నో- క్యాస్ట్ కేటగిరీని కూడా ఇందులో చేర్చింది ప్రభుత్వం. కులాల సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి వివిధ రకాల ప్రశ్నలను రూపొందించింది. మొత్తంగా 20 అంశాలతో కుల గణన ఉంటుంది.
ఈ-కేవైసీ రిజిస్ట్రేషన్‌లో భాగంగా సర్వేయర్లు ఫేసియల్, ఐరిస్, ఫింగర్ ప్రింట్‌తో వివరాలను సేకరిస్తారు. ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి ఇ-కేవైసీ వర్తించదు.












Click it and Unblock the Notifications