గుడ్ న్యూస్: నవంబర్ 27 నుంచి ఏపీలో..: ఫేసియల్, ఐరిస్, ఫింగర్‌ప్రింట్‌తో ఈ-కేవైసీ తప్పనిసరి
అమరావతి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కుల గణనకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కులాల వారీగా సర్వే చేపట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. దీనికి ముహూర్తాన్ని పెట్టింది. ఈ నెల 27వ తేదీన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది. దీనికి అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసింది.
కుల గణన.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. బిహార్ ప్రభుత్వం మొదటగా దీన్ని చేపట్టింది. అనంతరం పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కులాలవారీగా సర్వే చేపట్టాయి. ఇప్పుడు ఏపీ.. ఈ జాబితాలో చేరనుంది. బీసీ కుల గణనను చేపట్టడానికి గతంలో ప్రభుత్వం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది.

ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసింది. కుల గణనను నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించనుంది. సచివాలయ ఉద్యోగులు తమ పరిధి ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి వారి వివరాలను సేకరిస్తారు. వారు సేకరించిన లెక్కలపై అధికారులు రీవెరిఫికేషన్ నిర్వహిస్తారు.
సచివాలయ పరిధిలో 10 శాతం ఇళ్లల్లో రీ వెరిఫికేషన్ చేస్తారు. సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన గణన వివరాలను సరిపోల్చి చూస్తారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగులకు ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తుంది.
వివరాలను సేకరించే సమయంలో ఫేసియల్, ఐరిస్, ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని వినియోగిస్తారు. ఇప్పటికే అయిదు జిల్లాల్లో ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా చేపట్టింది. శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, నెల్లూరు, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున అయిదు సచివాలయాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ప్రభుత్వం కుల గణనను ప్రారంభించింది.
కులాల సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి వివిధ రకాల ప్రశ్నలను రూపొందించింది. మొత్తంగా 20 అంశాలతో కుల గణన ఉంటుంది. ఈ-కేవైసీ రిజిస్ట్రేషన్‌లో భాగంగా సర్వేయర్లు ఫేసియల్, ఐరిస్, ఫింగర్ ప్రింట్‌తో వివరాలను సేకరిస్తారు. ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి ఇ-కేవైసీ వర్తించదు.












Click it and Unblock the Notifications