కేసులపై సిట్!: కేసీఆర్‌ని ఇరుకున పెట్టేందుకు బాబు ప్రతివ్యూహం
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కారు తమను ఇబ్బంది పెడుతుండటంతో... ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. ఈ క్రమంలో ఆదివారం నాడు డీజీపీ జేవీ రాముడు, ఏసీబీ చీఫ్ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధలతో భేటీ అయ్యారు.
ప్రధానంగా తన ఫోన్‌తో పాటు తన చుట్టూ ఉన్న దాదాపు120 మంది ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలు పోలీసు స్టేషన్లలో తెలంగాణ కేసీఆర్ తదితరుల పైన కేసులు నమోదయ్యాయి.
తాజాగా ఈ కేసులన్నింటినీ దర్యాఫ్తు చేసేందుకు ఓ ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని (సిట్)ను రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు ఆదివారం నాడు చర్చించారని తెలుస్తోంది. దీనికి పోలీసులు బాస్‌లు కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్‌కు గురైందన్న ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంపై ఏపీలోని 13 జిల్లాల పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తునకు గాను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఈ వ్యవహారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆడియో టేపులు తదితర అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించే తీరు, తీసుకునే చర్యల ఆధారంగానే ఏపీలోనూ ముందుకు వెళ్లాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం.
ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్‌పై ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కేసులు, వాటి సెక్షన్ల తీవ్రతపైన చర్చ నడిచింది. ఆ కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో సిట్‌ను నియమించాలనే చర్చ కూడా వచ్చిందని తెలుస్తోంది.
రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిందని, చట్టం ముందు ఈ కేసులు ఏవీ నిలబడవనే ప్రస్తావన కూడా వచ్చింది. పబ్లిక్ సర్వెంట్ యాక్ట్, దాని పరిధి, అందులోని అంశాలు తదితర విషయాలపైన లోతుగా చర్చించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో ఏపీ ప్రభుత్వానికి ఉండాల్సిన హక్కులు ఏవీ లేకుండా పోయాయన్న దానిపైన కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది. పదేళ్ల వరకూ ఉమ్మడి రాజధాని పైనా చర్చ జరిగింది. చట్టం ప్రకారం సెక్షన్ 8 అమలయ్యేలా ఏయే చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలన్నదానిపైన పోలీసు ఉన్నతాధికారుల అభిప్రాయాలు తీసుకున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications