అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం: తక్షణ చర్యలు
RG Car gang rape: కోల్‌కతలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దుమారం రేపుతోంది. రోజురోజుకూ దీని తీవ్రత పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి.
ఈ నెల 9వ తేదీన ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది. హత్య చేయడానికి ముందు ఆమె గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా మెడికోలు, జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 24 గంటల పాటు నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఔట్ పేషెంట్ విభాగాలు మూతపడ్డాయి.
ఈ దారుణ ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోకుండా ఉండటానికి తక్షణ చర్యలపై దృష్టి సారించింది. వైద్య ఆరోగ్యం- హోం మంత్రిత్వ శాఖ సమన్వయంతో వ్యవహరించేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలుస్తోంది.
దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్.. హోం మంత్రి వంగలపూడి అనితతో మాట్లాడారు. డాక్టర్లకు భద్రత కల్పించేలా, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ఆసుపత్రుల వద్ద పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలని, నిరంతరం పోలీసు భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆసుపత్రుల్లో సురక్షిత వాతావరణం ఉందనే భావం ప్రజల్లో కల్పించాలని కోరారు. ఈ విషయంలో హోం, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు కలిసి పని చేస్తాయని చెప్పారు. అలాంటి వాతావరణాన్ని డిమాండ్ చేసే హక్కు డాక్టర్లకు ఉందని అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సత్యకుమార్ చెప్పారు.

దీనికి వంగలపూడి అనిత సానుకూలంగా స్పందించారు. ఆసుపత్రులు, డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, మెడికల్ సిబ్బందిపై దాడులను అడ్డుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీసీటీవీల ద్వారా ఆసుపత్రులను నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రుల్లో అవుట్ పోస్టుల వద్ద పోలీసు సిబ్బందిని నియమిస్తామని, ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే నమోదు చేస్తామని అన్నారు.
వైద్య కళాశాల, ఆసుపత్రుల క్యాంపస్‌లలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి సురక్షితమైన పని వాతావరణాన్ని కల్సించడానికి ప్రత్యేకంగా ఓ విధానాన్ని తీసుకొస్తామని అనిత పేర్కొన్నారు. దీనికోసం రెండు మంత్రిత్వ శాఖలు కలిసి పని చేస్తాయని అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న డాక్టర్లకు ఆమె సంఘీభావం తెలియజేశారు.












Click it and Unblock the Notifications