కుటుంబానికి రూ.3వేలు... నిధులు విడుదల చేసిన చంద్రబాబు
ఏపీలో దాదాపుగా మూడు వారాల నుంచి జోరుగా వానలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కొంత శాంతించినప్పటికీ తీర ప్రాంతాల్లో మాత్రం వర్షాలు పడుతూనే ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద చేరుతుండటంతో గోదావరి వద్ద ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరదలవల్ల, వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించిన నిధులను విడుదల చేశారు.
రూ.3వేలకు సాయం పెంపు
భారీ వర్షాల వల్ల పునరావాస కేంద్రాలకు చేరిన బాధితులకు కుటుంబానికి రూ.3వేల చొప్పున ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం రూ.2వేల సాయం చేయగా, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రూ.3వేలకు పెంచింది. పరిహారం సొమ్ముతోపాటు 25 కేజీల బియ్యం, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పామోలివ్ నూనె, కందిపప్పు కూడా అందివ్వాలని ఆదేశించారు. నిత్యావసరాల కోసం, ప్రత్యేక ఆర్థిక సాయం కోసం అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.15.29 కోట్లు విడుదల చేశారు. వరద ప్రభావానికి గురైన ఎనిమిది జిల్లాల్లో తాగునీటి సరఫరా, పాలు, ఆహారం, పారిశుధ్యం, వైద్యసేవల కోసం రూ.26.50 కోట్లు మంజూరయ్యాయి.

వరద ప్రవాహంవల్లే అధిక నష్టం
గతేడాది డిసెంబరులో తుపాను నష్టానికి రూ.847.22 కోట్లు, ఖరీఫ్ లో వాటిల్లిన పంట నష్టానికి సంబంధించి రూ.442 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. నష్టపోయిన పంటలకు సంబంధించి వివరాలు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆయా జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంవల్లే అధిక నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల మొదటివారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో సాయపడేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ నాలుగు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచింది. కొన్ని జిల్లాల్లో రాబోయే రెండురోజులు తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications