అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు.. సజ్జనార్ కీలక హెచ్చరికలు
హైదరాబాద్ మహా నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. వర్షం ధాటికి రహదారులన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రద్దీ ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
నగరంలోని మియాపూర్, కూకట్ పల్లి, రాయదుర్గం, యూసుఫ్ గూడ, మాదాపూర్, దిల్ సుఖ్ నగర్, కాప్రా, కోఠి, ఖైరతాబాద్, మలక్ పేట, నాచారం తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ ఛార్జ్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో అధికారులు పనిచేయాలని సూచనలు చేశారు.
మరోవైపు నగరంలో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక ట్వీట్ పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. "హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నందున నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ప్రయాణం తప్పనిసరైతే.. నీరు నిలిచిన రోడ్లపై వాహనాలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయవద్దు.

వాహనాలను చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పక పాటించాలి. ప్రయాణాలకు కొంత అదనపు సమయాన్ని కేటాయించుకోవడంతో పాటు, సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ విభాగం ఇచ్చే అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.. అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఎలాంటి అత్యవసర సహాయానికైనా వెంటనే 'డయల్ 100' కు కాల్ చేయాలని వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం 24 గంటలూ మీ రక్షణ కోసం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications