దేశంలోనే మొట్టమొదటి సారిగా పట్టాలెక్కిన LNG ట్రైన్: ఈ స్టేషన్ల మధ్య పరుగులు
రైల్వేలో ఓ నూతన మార్పునకు అడుగులు పడ్డాయి. మొట్టమొదటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) తో నడిచే రైలు పట్టాలెక్కింది. పూర్తిగా ఎల్ఎన్జీతో నడుస్తుందిది. కొద్దిసేపటి కిందటే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా.. పచ్చజెండా ఊపారు. గుజరాత్ అహ్మదాబాద్ లోని సబర్మతి స్టేషన్ లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. దీంతో పాటు 1,472 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే వివిధ రైల్వే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.
ఈ నూతన ఎల్ఎన్‌జీ రైలు డీజిల్, గ్యాస్ ఆల్టర్నేటివ్ డ్యూయల్-ఫ్యూయల్ సాంకేతికతతో పనిచేస్తుంది. సబర్మతి ఇంటెగ్రేటెడ్ కోచింగ్ డిపో పరిధిలో ఉన్న రెండు 1400 హెచ్‌పీ శక్తిమంతమైన డ్రైవింగ్ పవర్ కార్లను ఇందుకు అనుగుణంగా మార్చారు. ఎల్ఎన్జీ రైలు అందుబాటులోకి రావడం ద్వారా డీజిల్ వాడకం దాదాపు 40 శాతం వరకు తగ్గుతుంది. పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువుల ఉద్గారాలు గణనీయంగా అడ్డుకట్ట వేసినట్టవుతుంది.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. రైల్వేలో పర్యావరణ హిత మార్పుల గురించి వివరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ రవాణా కోసం 293 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగించిందని, 2024-25 నాటికి అది 108 కోట్ల లీటర్లకు పడిపోయిందని పేర్కొన్నారు. 2030 నాటికి దేశీయ రైల్ నెట్‌వర్క్‌లో డీజిల్ వినియోగాన్ని పూర్తిగా సున్నా స్థాయికి చేర్చాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. దీనివల్ల చమురు దిగుమతులు తగ్గి దేశీయంగా సంపద భారీగా ఆదా అవుతుందని చెప్పారు.
రైల్వే లైన్ల విద్యుద్దీకరణ విషయంలోనూ సాధించిన ప్రగతిని అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2010-11 కాలంలో 75 కిలోమీటర్ల మేర మాత్రమే ఉన్న రైల్వే విద్యుద్దీకరణ.. 2023-24 నాటికి రికార్డు స్థాయిలో 7,188 కిలోమీటర్లకు చేరుకుందని అన్నారు. ప్రస్తుతం దేశంలోని రైల్వే నెట్‌వర్క్‌లో 99.6 శాతం విద్యుద్దీకరణ పూర్తయిందని, ప్రపంచవ్యాప్తంగా స్వీడన్ మాత్రమే వంద శాతం విద్యుద్దీకరణ సాధించిందని వ్యాఖ్యానించారు.
పర్యావరణ అనుకూల వసతులతో పాటు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోన్నామని, ఇందులో భాగంగా అహ్మదాబాద్ డివిజన్ పరిధిలోని 404 కిలోమీటర్ల మేర దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసిన కవచ్ ఆటోమేటిక్ డిఫెన్స్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుమారు రూ. 411 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపడుతున్నామని వివరించారు. అహ్మదాబాద్-పాలన్‌పూర్, అహ్మదాబాద్-సమఖియాలి మార్గాల్లో ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి రానుందని చెప్పారు.
తమ ప్రభుత్వం గురించి అన్ని రకాల అర్థంలేని మాటలు మాట్లాడే కాంగ్రెస్ నాయకులను ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ 12 లక్షల కోట్ల రూపాయల విలువైన కుంభకోణాలు, అవినీతికి పాల్పడటం తప్ప మరేమీ చేయలేదని విమర్శించారు. ఈ 12 ఏళ్లల్లోనే ప్రధాని మోదీపై అవినీతికి సంబంధించి కనీసం చిన్న ఆరోపణ కూడా ఎవరూ చేయలేకపోయారని పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications
