అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ పక్క నుంచే హైస్పీడ్ రైలు రూట్, రెండింటికీ కలిపే..!!
కేంద్రం ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. కేంద్రం గత బడ్జెట్ లో రాష్ట్రం మీదుగా కొత్తగా హై స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించింది. కాగా.. ఈ రూటు విషయంలో ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాల్లోని హైస్పీడ్ రైలు అలైన్‌మెంట్‌లను ఖరారు చేసినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గాలనే ఖరారు చేయాలని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
కేంద్రం నిర్ణయించిన హై స్పీడ్ రైలు కారిడార్ల విషయంలో తుది కసరత్తు జరుగుతోంది. ప్రతి పాదిత మూడు రైల్వే లైన్లకు చెందిన స్టేషన్లు, బహుదూర్‌గూడలో హైస్పీడ్ రైల్ హబ్ ఏర్పాటు గురించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చాయి. కాగా.. హైదరాబాద్-ముంబై-పుణె కారిడార్ మొత్తం 671 కి.మీ. దీంట్లో తెలంగాణలో 93 కి.మీ. మార్గం ఉంటుంది. రాష్ట్రంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోనే హైస్పీడ్ రైలు లైను ఉండనుంది. ఈ మార్గంలో బహదూర్‌గూడ, కోకాపేట, వికారాబాద్‌లలో స్టేషన్లు రానున్నాయి. వీటికి వరుసగా శంషాబాద్, సైబరాబాద్, అనంతగిరి హిల్స్‌గా పేర్లు పెట్టనున్నారు. హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైల్ మార్గం శంషా బాద్, భారత్ ఫ్యూచర్‌సిటీ, ఆమనగల్, మన్ననూరు, సోమశిల, శ్రీశైలం మీదుగా వెళ్లనుంది. తెలంగాణ పరిధిలో 205 కి.మీ.ల రైలు మార్గం ఉంటుంది. శంషాబాద్ నుంచి మొదలై ఓఆర్‌ఆర్‌కు 3-5 కి.మీ.ల దూరం నుంచి వెళ్లేలా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు.

తాజా ప్రతిపాదనలతో
కాగా.. అచ్చంపేట టౌన్‌కు 8 కి.మీ.లు, మహబూబ్‌నగర్ టౌన్‌కు 80 కి.మీ.ల దూరం నుంచి ఇది వెళ్తుంది. ఈ రూట్‌లో మన్ననూరు దగ్గర స్టేషన్‌ను ప్రతిపాదించారు. దానిని నల్లమల స్టేషన్‌గా పేరు మార్చతూ రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రతిపాదించిన మార్గం మొత్తం 760 కి.మీ.లు. తెలంగాణ పరిధిలో ఇది 180 కి.మీ.ల వరకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్-అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డుకు సమాంతరంగా దీనిని నిర్మించాలని నిర్ణయించారు. శంషాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ మార్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డ్రైపోర్టు, హాలియా, వాడపల్లి దగ్గర స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ పరిధిలో దాదాపు 40 గ్రామాల మీదుగా ఈ రైలు మార్గం ఉండనుంది. హైస్పీడ్ రైలు, 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పక్కపక్కనే వెళ్లేలా ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ఖరారు చేశాయి.













Click it and Unblock the Notifications
