ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా మరో హామీని అమలు చేయబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. తీర ప్రాంతాంలోని మత్స్యకారులకు వేట నిషేధ సాయం కింద రూ.20వేలు అందజేస్తామని టీడీపీ ప్రకటించింది. తీరప్రాంతాల్లోని మత్స్యకారులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రూ.20వేలు ప్రకటించిన విషయాన్ని వర్మ గుర్తుచేశారు.
పిఠాపురంకు మొండిచెయ్యి చూపిన వంగా గీత
త్వరలోనే వీరందరికీ పరిహారం అందబోతున్నట్లు చెప్పారు. దీంతోపాటు పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.4 లక్షల ఇంటి రుణం మంజూరు చేయబోతున్నట్లు వెల్లడించారు. మత్స్యకారులంతా ఈ రుణాన్ని పొంది సొంత ఇళ్లను నిర్మించుకోవాలని కోరారు. దళితుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ నాయకులకు లేదని, అంబేద్కర్ పై వారికి ఎంతో ప్రేమ ఉన్నట్లు నిరసనలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వంగా గీత ఎంపీగా ఉన్న సమయంలో పిఠాపురంకు మొండిచెయ్యి చూపించిందన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో దళితులపై దాడి జరిగితే ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ నాయకులంతా ఎక్కడున్నారని వర్మ ప్రశ్నించారు.

తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అతి ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావించారని, అలాగే స్మృతివనంలో ఆయన బాల్యం, విద్యాభ్యాసం, ఎదుర్కొన్న వివక్షత లాంటి వివరాలన్నీ పొందుపరచాలని భావించారన్నారు. భావితరాలకు గుర్తుండేలా, శాశ్వతంగా నిలిచిపోయేలా దీన్ని తీర్చిద్దాలనుకుంటే వైఎస్ జగన్ మాత్రం విజయవాడలో తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేశారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేది, మేలు కలిగేది చంద్రబాబు ప్రభుత్వంలోనేనని, రాబోయే ఆరు నెలల కాలంలో అన్నివర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉంటారన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో అన్ని సమస్యలను పవన్ కల్యాణ్ చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నారని, ఇందులో ఎటువంటి అపోహలు అవసరంలేదన్నారు.












Click it and Unblock the Notifications