అమరావతి శ్రీవారి ఆలయంలో మూడు షిఫ్టుల్లో
రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం నూతన శోభను సంతరించుకుంటోంది. ఈ ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తిరుమల తరహాలో ఈ ఆలయం రూపుదిద్దుకుంటోంది. బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులన్నీ ముగించాలని టీటీడీ నిర్ణయించింది. ఆలయ విస్తరణ, ఆధునీకరణ కోసం టీటీడీ ఇదివరకే 260 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
నిజానికి ఈ ఆలయ పనులు 2028 ఉగాది నాటికి పూర్తి చేయాలని మొదట్లో టీటీడీ భావించింది. అంతకంటే ముందే.. అంటే ఈ సెప్టెంబర్ లో తిరుమలలో నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నాటికే ప్రధాన నిర్మాణాలన్నింటినీ పూర్తి చేయాలని ప్రతిపాదించింది. దీంతో విస్తరణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో కొనసాగుతున్నాయి. రాత్రి వేళ కూడా పనులు చకచకా పూర్తవుతున్నాయి. టీటీడీ జేఈఓ) డాక్టర్ ఎ శరత్.. ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.

అర్ధరాత్రి వేళల్లో ఆలయ నిర్మాణ స్థలాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, కాంట్రాక్ట్ సంస్థలను పరుగులు పెట్టిస్తున్నారు. ఆలయ పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూసుకుంటోన్నారు. మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టినందున అదనపు కార్మికులను నియమించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఈ ఆలయాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తీసుకుని రావాలనే పట్టుదలతో ఉంది టీటీడీ.
ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.. తూర్పు వైపున నిర్మిస్తున్న 120 అడుగుల ఎత్తైన, ఏడంతస్తుల మహా రాజగోపురం. ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో మూడు అంతస్తుల ఇతర రాజగోపురాలను నిర్మిస్తోన్నారు. ఈ దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం అందమైన ప్రాకారాలు, కల్యాణోత్సవం, ఉత్సవాలు, ఆర్జిత సేవల మంటపాలు నిర్మితమౌతోన్నాయి. వీటితో పాటు అద్దాల మంటపం, వాహన మంటపం, రాధా మంటపం, పుష్కరిణి, ఆంజనేయస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
ప్రధాన కట్టడమైన ఏడంతస్తుల మహా రాజగోపురానికి సంబంధించిన రాఫ్ట్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ పనులు వేగవంతం అయ్యాయి. రాజగోపుర మంటపం, పడికావలి మంటపాల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఆయా కట్టడాలతో సమాంతరంగా.. లడ్డూ విక్రయ కేంద్రం, అన్నప్రసాద భవనం, విశ్రాంతి గదులు, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, ఇతర కాటేజీలు, ఆడిటోరియం వంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.



Click it and Unblock the Notifications