క్యూర్ పరిధిలో 21 వేల ఇళ్లు పూర్తి.. పంపిణీకి ముహూర్తం ఫిక్స్!
క్యూర్ పరిధిలో సొంతింటి కల నెరవేర్చుకోవాలని భావించే వారికి తెలంగాణా రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలోని 26 ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని ఆయన శుభవార్త చెప్పారు.. మొత్తం 21 వేల ఇళ్లు సిద్ధమయ్యాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ఈ ఇళ్లకు లబ్ధిదారులను ఈ నెలాఖరులోగా ఎంపిక చేయాలని అధికారులకు కచ్చితమైన ఆదేశాలను ఇచ్చారు. సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, హౌసింగ్, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పూర్తయిన ఈ ఇళ్లకు సెప్టెంబరు 30 లోపు యుద్ధప్రాతిపదికన లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చెయ్యాలన్నారు.

ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని మంత్రి సూచించారు. ఈ ప్రక్రియలో లబ్దిదారుల ప్రస్తుత నివాసం కొత్తగా నిర్మాణం చేసిన ఇళ్లకు దగ్గరగా ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని కూడా చెప్పారు. ఇళ్లు ఉన్న ప్రాంతానికి ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల లోపు నివసించేవారినే ఎంపిక చేయాలని సూచించారు. అక్కడ తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సదుపాయాలు సరిగ్గా ఉండేలా చూడాలన్నారు.
వాటర్ వర్క్స్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖలు కలిసి పని చేయాలని ఆదేశించారు. అక్టోబరు నెలాఖరులోగా ఈ మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని కూడా చెప్పారు. ఇప్పటికే రెండు పడకగదుల ఇళ్లలో ఉన్న అనర్హులను తొలగించాలని, అక్కడ నివసించని వారికి ఫైనల్ నోటీసు ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. స్పందించని వారి ఇళ్లను రద్దు చేసి, వారి స్థానంలో అర్హులకు కేటాయించాలన్నారు.
క్యూర్ పరిధిలో ఇంటి స్థలాలు ఉండి అర్హులైన దాదాపు 9 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని కూడా తెలిపారు. ఇన్‌ఛార్జి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించాలని సూచించారు. ఈ నిర్ణయాలు పేద ప్రజలకు స్వంత ఇల్లు కల్పించే దిశగా మరో అడుగు. ఇళ్లు పూర్తయిన తర్వాత సదుపాయాలు సకాలంలో అందేలా చూడడం ముఖ్యమని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications
