ఏపీకి కేంద్రం వరం.. నాలుగు విమానాశ్రయాలకు అదనపు హంగులు!
ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం ఫోకస్ చేస్తుంది. రాష్ట్రంలోని విమానాశ్రయాలను మెరుగుపరచడం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం పెరిగితే ప్రజలు సులభంగా ప్రయాణించగలుగుతారని భావించి, మెరుగైన సౌకర్యాల కల్పనకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఈ విమానాశ్రయాల అభివృద్ధికి మొత్తం రూ.912.94 కోట్లు కేటాయించారు.
ఈ నిధులతో రన్‌వేలు విస్తరించడం, కొత్త టెర్మినల్ భవనాలు కట్టడం, అనుసంధాన రోడ్లు వేయడం, ప్రయాణికులకు అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతోంది. ఈ క్రమంలో విజయవాడ, తిరుపతిలో చేపట్టిన పనులు ఇప్పటికే చాలావరకు పూర్తయ్యాయి. రాజమహేంద్రవరం, కడపలోని పనులు ఇంకా కొనసాగుతున్నాయి. విజయవాడ విమానాశ్రయంలో రూ.473 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, టెక్నికల్ బ్లాక్ నిర్మాణం జరిగింది.

ఇవి పూర్తయితే 16 వేల చదరపు మీటర్ల కొత్త భవనాలు అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి అవసరంగా మారింది .రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రూ.173.28 కోట్లతో కొత్త డొమెస్టిక్ టెర్మినల్, ఇతర సదుపాయాలు నిర్మిస్తున్నారు. 91 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలినవి త్వరలో అయిపోతాయని అధికారులు చెబుతున్నారు.
దీనివల్ల సుమారు 21 వేల చదరపు మీటర్ల స్థలం అదనంగా లభిస్తుంది. తిరుపతి విమానాశ్రయంలో రూ.55.92 కోట్లతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, టెక్నికల్ బ్లాక్ నిర్మాణం పూర్తయ్యాయి. వీటిని త్వరలో ప్రారంభించాల్సి ఉంది. తిరుపతి నుంచి ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెళగావి, కొల్హాపూర్, శివమొగ్గ, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గోవా వంటి చోట్లకు సర్వీసులు నడుస్తున్నాయి.
ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మరిన్ని విమానాలు ప్రయాణికులకు సౌకర్యాలను అందించవచ్చు. దీంతో ప్రజలు సులభంగా, తక్కువ సమయంలో ప్రయాణించే అవకాశం పెరుగుతుంది. రాష్ట్రంలో విమానయాన రంగం మరింత బలపడుతుంది. ఇది మాత్రమే కాదు ఏపీలో ఏవియేషన్ అభివృద్ధికి కూడా మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో విశేషమైన కృషి జరుగుతోంది.













Click it and Unblock the Notifications
