ఏపీలో మందుబాబులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు
ఏపీలో గత ఐదు సంవత్సరాల నుంచి అభాసుపాలైన మద్యం విధానాన్ని తిరిగి గాడిలో పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ రద్దు చేసింది. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో మద్యానికి సంబంధించి ఏ తరహా విధానం ఉందో దాన్నే అమలు చేయబోతున్నారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లోని మద్యం విధానాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ విధానమే ఏపీకి అనువుగా ఉంటుందని అధికారులు తేల్చారు.
దీంతో రిటైల్ వ్యాపారాన్ని తిరిగి ప్రయివేటు వ్యక్తులకే అప్పగించబోతున్నారు. తెలంగాణలో అమలవుతున్న విధానంలో కొన్ని మార్పులు చేసి ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు. దుకాణాలను కేటాయించేందుకు ఒక వ్యక్తి నుంచి ఎన్ని లైసెన్స్ లైనా తీసుకోనున్నారు. ప్రతి దరఖాస్తుకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ రుసుము విధిస్తారు. మద్యం ధరలు కూడా కర్ణాటక, తెలంగాణతో సమానంగా ఉండేటట్లు చూస్తారు.

నూతన మద్యం విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర సభ్యులుగా ఉంటారు. అధ్యయనానికి సంబంధించిన నివేదికలను, ఎక్సైజ్ శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి ఉపసంఘం ఓ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రికి పంపిస్తుంది. అంతకుముందు ధరలపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన వారం పదిరోజుల్లో కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేస్తారు. వచ్చేనెల ఐదోతేదీ నుంచి ఎక్సైజ్ శాఖలో బదిలీలు చేపట్టబోతున్నారు. తర్వాత దరఖాస్తుల స్వీకరణ, లైసెన్స్ ల కేటాయింపు తదితర ప్రక్రియను పూర్తిచేసి అక్టోబరు ఒకటి నుంచి నూతన మద్యం విధానం అందుబాటులోకి తెస్తారు.












Click it and Unblock the Notifications