అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్: ఎక్కడ, ప్రాధాన్యత ఏంటీ?
అమరావతి: ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్ అందించిన మాస్టర్ ప్లాన్‌లో రాజధానిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై స్పష్టత కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎయిర్ పోర్ట్ ఎక్కడ నిర్మించాలనే దాని విషయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
అయితే తుళ్లూరు, మంగళగిరి, అమరావతిలలో ఎక్కడ ఎయిర్‌పోర్టు నిర్మించాలనే అంశంపైనే ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. దీంతో ఈ సర్వే బాధ్యతల్ని ప్రభుత్వం సీఆర్డీఏకు అప్పగించింది. మంగళగిరి ప్రాంతంలో కొండలు ఉండటంతో ఎయిర్ సిగ్నల్స్‌కు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.
అంతేకాదు పక్కనే నేషనల్ హైవే ఉండటంతో ల్యాండ్ ఇన్‌స్ట్రుమెంట్ సిస్టం(ఎల్‌ఈఎస్)కు అంతరాయాలు ఏర్పడి రాత్రి వేళల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. దీంతో రాజధానిలో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం మళ్లీ ఇప్పుడు తుళ్లూరు, అమరావతి ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఎయిర్ పోర్ట్ కోసం ఐదు వేల ఎకరాల భూములు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి చుట్టూ 180 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డుని కూడా ప్రభుత్వం నిర్మించాలనే ఆలోచనలో ఉంది.
హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డుకు సమీపంలోనే శంషాబాద్‌లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అమరావతిలో కూడా ఔటర్ రింగురోడ్డు పక్కనే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌ని నిర్మించాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా భూముల లభ్యత ఎక్కడ ఉంది? అన్నింటికి అనువైన ప్రాంతం ఏది? అనే అంశాలతో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక అందించాలని సీఆర్‌డీఏకు ఆదేశాలు జారీ చేశారు.
ఇది ఇలా ఉంటే రాజధానిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మించనున్న నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్టును కార్గో ఎయిర్‌పోర్టుగా వినియోగిస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజధాని ప్రాంతానికి గన్నవరం ఎయిర్‌పోర్టు సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.












Click it and Unblock the Notifications