ఏపీలో రైతాంగానికి షాక్
ఎన్ని తుఫాన్లు వచ్చినా.. ఎన్ని భారీ వర్షాలు కురిసినా.. ఏపీని మాత్రం కరవు వీడట్లేదు. ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కరవు మండలాలను ప్రకటించింది. మొత్తం మూడు జిల్లాల్లో కరవు ఉన్నట్లు గుర్తించింది. దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న మండలాల జాబితాను విడుదల చేసింది.
ఖరీఫ్ 2025లో కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటించడానికి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించింది. అక్టోబరు 29వ తేదీన వర్చువల్ సమావేశం నిర్వహించింది. జిల్లా కలెక్టర్ల నుండి అందిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించింది. మాన్యువల్ ఫర్ డ్రౌట్ మేనేజ్‌మెంట్ 2016 మార్గదర్శకాల ఆధారంగా ఈ పరిశీలన జరిగింది. ఖరీఫ్ 2025కు సంబంధించి కరవు ప్రభావిత మండలాల గుర్తింపుపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది.

దీని ప్రకారం- అన్నమయ్య రాయచోటి, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 37 మండలాల్లో కరవు ఏర్పడింది. వీటిని కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో తీవ్ర కరవు ఏర్పడిన మండలాలు 12 ఉన్నాయి. మిగిలిన 25 మండలాల్లో సాధారణ కరవు ఏర్పడినట్లు గుర్తించారు. అన్నమయ్య జిల్లాలో 9 సాధారణ కరవు మండలాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 12 తీవ్ర కరవు, 13 సాధారణ కరవు మండలాలు, ప్రకాశం జిల్లాలో 3 సాధారణ కరవు మండలాలు ఉన్నాయి.
- అన్నమయ్య జిల్లాలో- గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లి, వాల్మీకిపురం, కురబలకోట, మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం.
- శ్రీ సత్యసాయి జిల్లాలో- అగలి, అమడగూరు, గాండ్లపెంట, హిందూపురం, మడకశిర, ముదిగుబ్బ, నంబుల పూలకుంట, ఓబుల దేవర చెరువు, రామగిరి, రోళ్ళ, తలుపుల, తణేకల్, అమరాపురం, బత్తలపల్లి, బుక్కపట్నం, ధర్మవరం, గుడిబండ, కదిరి, కనగానిపల్లి, కొత్త చెరువు, లేపాక్షి, నల్లచెరువు, నల్లమాడ, పుట్టపర్తి, సోమందేపల్లి.
- ప్రకాశం జిల్లాలో- కొండపి, జరుగుమిల్లి, పొన్నలూరు ఉన్నాయి. ఈ మేరకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ సాయి ప్రసాద్ నోటీఫికేషన్ జారీ చేశారు.












Click it and Unblock the Notifications