rains : ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. తూర్పు, పడమర మధ్య సముద్రమట్టానికి 3.6 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈదురుగాలు, ఉరుములు, పిడుగులతో అక్కడక్కడా వానలు పడుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉంది.
పిడుగులతోపాటు ఈదురు గాలులు
అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఆదివారం ఏపీవ్యాప్తంగా అక్కడక్కడా పిడుగులు, ఈదురు గాలులతో వర్షం పడింది. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. కర్నూలు జిల్లా లూరులో 23.4, నంద్యాల జిల్లా అవుకులో 22.4, అనంతపురం జిల్లా గుంతకల్లులో 22.2, నెల్లూరు జిల్లా కావలిలో 75.6 మిల్లీ మీటర్లు, నెల్లూరు కందకూరులో 25.2, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 20.4, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 40, నెల్లూరు జిల్లా సీతారామపురంలో 31.2, కర్నూలు జిల్లా పత్తికొండలో 28, కర్నూలు జిల్లా ఆస్పత్రిలో 20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

రెండు రోజులు భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిసా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాబోయే ఐదు రోజులు ఈ రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నట్లు తెలిపింది. ఈ రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications