బంగాళాఖాతంలో అల్పపీడనాల హోరు.. ఏపీపై వర్షాల దండయాత్ర
బంగాళాఖాతంలో ఐదు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీనికితోడు మరో అల్ప పీడనం ఏర్పడబోతున్నట్లు, వీటితోపాటు భూ ఉపరితలంపై కూడా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దీని ప్రభావం పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రానున్న 24 గంటలు రాయలసీమతోపాటు కోస్తాలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద
విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ కు వరద పెరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 2.67 లక్షల క్యూసెక్కుల నీరు నిల్వ ఉండటంతో లంక గ్రామాల ప్రజలు, పరీవాహక ప్రాంతాలకు సమీపంలోని ప్రజలతోపాటు తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం అవసరపడితే వెంటనే 1800 425 0101, 1070, 112 టోల్ ఫ్రీ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు. బుధవారం రాత్రికి శ్రీశైలం, సంకేశుల, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా నీరు నిల్వ ఉంది. కృష్ణా, గోదావరి నదుల్లో హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
అత్యధికంగా డోన్ లో
కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలోని డోన్ లో 101.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అమరావతిలో 75.9, వెంకటగిరిలో 83.2, తిరుపతి ఏరోలో 75, పార్వతీపురంలో 76.8, పార్వతీపురం జిల్లా కొమరాడలో 84.6, ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 97.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications