ఏపీలో జర భద్రం: ఈ సమయంలో బయటికెళ్లొద్దు
Temperature in AP: ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి.

నేడు రాష్ట్రవ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు,151 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు కూడా వడగాల్పుల తీవ్ర కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 61 మండలాల్లో తీవ్రవడగాల్పులు,159 చోట్ల వేడి గాలులు వీస్తాయని వివరించారు.
సోమవారం నాడు 670 మండలాల్లో సాధారణ స్థాయి నుంచి తీవ్ర వడగాల్పులు వీచినట్లు కూర్మనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 38 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యాయి. నెల్లూరు- 37, కడప- 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి.
తిరుపతి- 34, శ్రీసత్యసాయి- 32, చిత్తూరు- 31, అనంతపురం- 31, అన్నమయ్య రాయచోటి- 30, నంద్యాల- 29, ఏలూరు- 28, పల్నాడు- 28, విజయనగరం- 27, బాపట్ల- 25, కృష్ణా- 25, కర్నూలు- 25, అనకాపల్లి- 24, అల్లూరి సీతారామరాజు- 22, కోనసీమ- 22, కాకినాడ- 21 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని కూర్మనాథ్ సూచించారు. బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే- నేరుగా ఎండ తగలకుండా గొడుగును వినియోగించాలని కోరారు. టవల్ లేదా క్యాప్ పెట్టుకోవాలని అన్నారు. కాటన్ దుస్తులు ధరించాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications