ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న జగన్ సర్కారు
అమరావతి: ఆంధప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావడంతో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదదేశం పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి.
సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై కూడా ఈ భేటీలో నిర్ణయిస్తారు.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో సమావేశాలు మూడు రోజులు మాత్రమే జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ కూడా అవసరం లేదని, ఈ నేపథ్యంలోనే ఒకే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం, అదే రోజు ఆమోదించడం చేసే ఆలోచనలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉండగా.. ఫిబ్రవరి 6వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. అదే రోజు లేదా 7వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, ఖచ్చితంగా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగేది బీఏసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారు. ఈ అసెంబ్లీ చివరి సమావేశాలు కావడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఇది ఇలావుండగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సన్నద్ధం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం తన నివాసంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, సభా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. మరోవైపు, జగన్ ఎన్నికల హామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారంటూ 'ప్రజాకోర్టు' పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ చెబుతున్న 99 శాతం హామీల అమలు అనేది అతి పెద్ద బూటకం అని విమర్శించారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడటం ఖాయమన్నారు. అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది.












Click it and Unblock the Notifications